
- వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
- ఏమైనా సమస్యలుంటే గాంధీభవన్‌కు వచ్చి చెప్పుకోవాలి
- క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సూచన
- ఇక్కడ ధర్నాలు, నిరసనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్, దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కిట్స్‌ను పంపిణీ చేసేందుకు జులై 18న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు అనుచరులు ఎంపీ కారును అడ్డుకుని నానా హంగామా చేశారు.
మంచిర్యాల జిల్లా ఆర్‌జీపీఆర్‌ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, ఆర్‌టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, దండేపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఎంపీ కారును అడ్డుకుని ఫ్లెక్సీ చించివేశారు. ఎంపీ కారు బోనెట్‌పై ఆర్‌టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ కొట్టారు. ఎంపీ, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీపీ భాస్కర్, ఏసీపీ జోక్యం చేసుకుని ఆందోళనకారులను పక్కకు తోసివేసి ఎంపీ కాన్వాయ్‌ను పంపించేశారు.
నోటీసులు జారీ చేసిన క్రమశిక్షణ కమిటీ..
ఎంపీ వంశీకృష్ణ కారుపై దాడికి పాల్పడిన మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరులకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఆదివారం గాంధీభవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎంపీ వర్గీయులు చేసిన ఫిర్యాదు మేరకు ఆరుగురికి నోటీసులు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది.
ఎంపీ వంశీకృష్ణ కారుపై దాడి చేసిన గడ్డం త్రిమూర్తి, అక్కల వెంకటేశ్వర్లు, అంకతి శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్, లక్కకుల సృజన్, ఆకుల దుర్గప్రసాద్‌కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కమిటీ చైర్మన్ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ ఈ నోటీసులపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
వీరితోపాటు ఆదిలాబాద్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌కు, సంజీవ్‌రెడ్డికి, గజ్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి, జూపల్లి మల్లారెడ్డికి, సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన గొడవకు సంబంధించి డీసీసీ అధ్యక్షుడు సింగీతం శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురికి నోటీలు ఇచ్చారు.
కరీంనగర్ 3వ డివిజన్ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదుతో మూల లక్ష్మికి కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. కొండా సురేఖ, చిన్నారెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నకిరేకల్ సభకు రావడం శుభపరిణామమన్నారు. పార్టీలో ఫిర్యాదులు ఉంటే గాంధీభవన్‌కు వచ్చి నేరుగా చెప్పుకోవాలని సూచించారు. బహిరంగంగా ధర్నాలు, నిరసనలు
చేయవద్దని సూచించారు.