
తెలుగు మీడియంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి, 10వ తరగతి వరకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, వరంగల్‌లోని ఒక కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన ఒక సామాన్య యువకుడు సాధించిన విజయం ఎంతో స్ఫూర్తిదాయకం. ఎలాంటి అండదండలు లేని బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి.. కష్టపడి చదివి మొదట ఇన్ఫోసిస్‌లో 3.5 లక్షల వార్షిక వేతనంతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత తన ప్రతిభతో అంచలంచెలుగా ఎదుగుతూ.. ఏకంగా 40 లక్షల రూపాయల భారీ ప్యాకేజీ సాధించే స్థాయికి చేరుకున్నాడు. ఆర్థికంగా ఒక సాధారణ కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆ టెక్కీ ప్రయాణం ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచింది.
చేతిలో డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ఎలా పెట్టుబడి పెట్టాలనే ఆలోచన అతని జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. సంపాదించిన మొత్తాన్ని మరింత వేగంగా పెంచుకోవాలనే దురాశతో సోషల్ మీడియా వైపు ఆకర్షితుడయ్యాడు. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానెళ్లలో వచ్చే ట్రేడింగ్ సిగ్నల్స్‌ను నమ్మి స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టాడు. ప్రారంభంలో అతనికి 2 నుండి 3 లక్షల రూపాయల లాభాలు రావడంతో.. ఆ అదృష్టం అతనిలో మరింత అత్యాశను పెంచింది. సిగ్నల్స్‌పై నమ్మకం పోయి, తానే స్వయంగా ట్రేడ్ అనాలసిస్ చేస్తూ భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశాడు.
మార్కెట్ గమనాన్ని సరిగ్గా అంచనా వేయలేక ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇరుక్కుపోయి.. క్రమంగా తాను కూడబెట్టిన సంపాదననంతా కోల్పోవడం మొదలుపెట్టాడు. చివరికి అత్యాశ అతడిని ఏకంగా 50 లక్షల రూపాయల భారీ నష్టాల్లోకి నెట్టేసింది. తాను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు కళ్ల ముందే కరిగిపోవడంతో అతనికి ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. ఈ భారీ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇప్పుడు ఊళ్లో తనకున్న 2 ఎకరాల భూమిని అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
There is a relative of mine who completed his https://t.co/BC6fLkcQNf CSE from a Tier-3 college in 2016. Till 10th, he studied in a government school. Today, the same guy who started earning ₹3.5 LPA is now earning around ₹40 LPA. But recently, he lost ₹50 lakhs in day…
— Vikas Alwys (@VikasAlwys) August 27, 2026
ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నప్పటికీ.. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఎంతటి సంపాదనైనా క్షణాల్లో ఆవిరైపోతుందనేదానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది. షేర్ మార్కెట్ లేదా డే ట్రేడింగ్ లాంటి ప్రమాదకరమైన మార్గాల్లో సరైన అవగాహన లేకుండా అడుగుపెడితే జరిగే నష్టాలకు ఇది అద్దం పడుతోంది. ఒక్కసారి వచ్చిన లాభాలను చూసి గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టడం వల్ల జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులను కూడా కోల్పోవాల్సి వస్తుందని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
ఈ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. 3.5 లక్షల నుండి 40 లక్షల వరకు ఎదిగిన ఆ టెక్కీ ప్రయాణం ప్రశంసనీయమని.. కానీ ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం అతని జీవితాన్ని తలకిందులు చేసిందని చర్చించుకుంటున్నారు. ఎంతటి జీతం ఉన్నా సరే, అత్యాశకు పోయి చేసే కంట్రోల్ లేని రిస్క్‌లు మనిషిని రోడ్డున పడేస్తాయని, ఫ్యామిలీలను అస్తవ్యవస్థం చేస్తాయని నిరూపిస్తోంది.