
- బాధితులతో నిండిపోయిన ఎమర్జెన్సీ వార్డులు
- ఆసుపత్రుల ముందు బంధువుల ఎదురుచూపులు
ఖాట్మండు: నేపాల్‌లో ఆకస్మిక వరదల తర్వాత వందలాదిమంది ఆచూకీ తెలియడంలేదు.. బుధవారం నుంచి ఫోన్లు పనిచేయక, మనుషుల జాడ తెలియక వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆందోళనకు గురవుతున్నారు. అయినవాళ్ల కోసం ఆసుపత్రుల చుట్టూ పరుగులు పెడుతున్నారు. రెస్క్యూ చేసిన వారిని, మృతదేహాలను అధికారులు ఆసుపత్రులకు తరలిస్తుండడంతో ఆసుపత్రుల ముందు వందలాదిమంది గుమిగూడారు. ఎమర్జెన్సీ వార్డులతో పాటు మార్చురీలలోనూ తమ వాళ్ల ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మొబైల్ ఫోన్లలో ఫొటోలను చూపిస్తూ కనిపించిన వారినల్లా అడుగుతున్నారు.
జనం తాకిడి ఎక్కువగా ఉండడంతో ఎమర్జెన్సీ వార్డుల్లో చికిత్స పొందుతున్న వరద బాధితుల వివరాలను ఆసుపత్రుల మేనేజ్మెంట్లు నోటీసు బోర్డుల్లో పెడుతున్నారు. మార్చురీలలోని బాధితుల పేర్లనూ అందులో వెల్లడిస్తున్నారు. దీంతో అందులో తమ వాళ్ల పేర్ల కోసం బాధిత కుటుంబాలు, బంధువులు వెతుకుతున్నారు. మహారాజ్‌గంజ్‌లోని త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్‌తో పాటు ఖాట్మండులోని బిర్ హాస్పిటల్, నువాకోట్ లోని త్రిశూలి హాస్పిటల్, చిత్వాన్‌లోని భరత్పూర్ హాస్పిటల్‌లో వరద బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు రెస్క్యూ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. గల్లంతైన వారి పేర్లు, వివరాల నమోదుకు ప్రత్యేక డెస్క్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆరోగ్య శాఖ అధికారులు గురువారం ఉదయం నాటికి.. త్రిభువన్ టీచింగ్ హాస్పిటల్‌లో 20 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.
మృతదేహంపై బంగారం చోరీ
నేపాల్ వరదల్లో కొట్టుకువచ్చిన మృతదేహాల నుంచి కొందరు గోల్డ్ కొట్టేస్తున్నారు. టిబెట్‌లో కొండచరియలు విరిగిపడి ఉప్పొందిన వరదల కారణంగా ఓ మహిళ మృతి చెందింది. ఆమె మృతదేహం దిగువ ప్రాంతంలోని నారాయణి నదిలోకి కొట్టుకువచ్చింది. అయితే, చనిపోయిన మహిళను చూసిన ఇద్దరు వ్యక్తులు..ఆమె చెవులకున్న బంగారు పోగులను, వేళ్లకు ఉన్న బంగారు ఉంగరాలను దొంగిలించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. విపత్తు వేళ బాధితులను, మృతులను లక్ష్యంగా చేసుకుని అమానుష చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు.