Reading Time: 2 minutes
Maruti Suzuki Affordable Cars Adas Standard Feature India

Maruti Suzuki ADAS: భవిష్యత్తులో మారుతీ సుజుకీకి చెందిన చౌకైన కార్లలో కూడా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS) ఫీచర్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం సుజుకీ కంపెనీ ఇప్పటినుంచే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే రోజుల్లో తమ కార్లలో కోర్ ADAS ఫంక్షన్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందించాలని ప్లాన్ చేస్తోంది. అంటే చివరకు కంపెనీ నుంచి వచ్చే సరసమైన (బడ్జెట్) కార్లలో సైతం ఈ సేఫ్టీ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ప్లానింగ్ అంతా ముఖ్యంగా భారతీయ మార్కెట్‌ను మనసులో ఉంచుకుని చేస్తున్నదే. రోడ్డు ప్రమాదాలను వీలైనంత వరకు తగ్గించాలనేదే మారుతీ సుజుకీ ప్రధాన లక్ష్యం. దీనిపై సుజుకీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కట్సుహిరో కాటో మాట్లాడుతూ.. “అతి ఖరీదైన ADAS సిస్టమ్స్‌ను కేవలం కొద్దిపాటి లగ్జరీ కార్లలో మాత్రమే అమర్చడం వల్ల రోడ్డు ప్రమాదాలను పెద్దగా తగ్గించలేం” అని స్పష్టం చేశారు.

అసలు కంపెనీ ప్లాన్ ఏంటంటే..?

ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్ వంటి అత్యంత ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లను అన్ని కార్లలో స్టాండర్డ్‌గా అందించడమే సుజుకీ లక్ష్యం. ఇక డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేసే అదనపు కంఫర్ట్ ఫీచర్లను మాత్రం టాప్ వేరియంట్లలో ఆఫర్ చేయనున్నారు. ఈ పద్ధతిని కంపెనీ ‘రైట్ ADAS అప్రోచ్’ అని పిలుస్తోంది. ముఖ్యంగా ఈ సిస్టమ్‌ను మన భారతీయ రోడ్డు పరిస్థితులకు తగ్గట్టుగా డిజైన్ చేయడంతో పాటు, దీని ధర సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చూడటంపై కంపెనీ ఎక్కువ దృష్టి పెట్టింది. ఇక, ధర తగ్గించడం కోసం సుజుకీ ఒక ప్రత్యేకమైన ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. ఇందులో హై-రిజల్యూషన్ కెమెరాలు, AI చిప్‌లను ఉపయోగించబోతున్నారు. దీనికి తోడు డ్రైవర్, ప్యాసింజర్ల పర్యవేక్షణను కూడా ADAS ఫీచర్‌తో క్లబ్ చేయనున్నారు. మెరుగైన భద్రతను ఇస్తూనే, తయారీ వ్యయాన్ని తగ్గించడమే కంపెనీ మెయిన్ టార్గెట్. అయితే ఇవన్నీ ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలోనే ఉన్నాయి. ప్రొడక్షన్ వెర్షన్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రమాదాలు జరగకుండా ADAS ద్వారా అడ్డుకోవడం ఒకెత్తయితే, ఒకవేళ ప్రమాదం జరిగితే కార్లోని ప్రయాణికులకు రక్షణ కల్పించడం మరో ఎత్తుగా కంపెనీ రెండు వైపులా భద్రతా ప్రణాళికలు రచిస్తోంది.

ఈ టెక్నాలజీ తక్కువ ధరలో ఎలా సాధ్యమవుతుందంటే.. ఇది మారుతీ సుజుకీ డెవలప్ చేస్తున్న పెద్ద ‘SDV రైట్ స్ట్రాటజీ’లో ఒక భాగం. భవిష్యత్ కార్ల ఎలక్ట్రానిక్ ఆర్కిటెక్చర్‌ను వీలైనంత సరళంగా (సింపుల్‌గా) మార్చాలని కంపెనీ భావిస్తోంది. కమ్యూనికేషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్, బాడీ-కంట్రోల్ వంటి అనేక రకాల ఫంక్షన్లను ఒకే సెంట్రల్ జోన్ ECUకి అనుసంధానించనున్నారు. ఈ కొత్త సెటప్ వల్ల ప్రస్తుత సిస్టమ్‌తో పోలిస్తే దాదాపు 30 శాతం వరకు ఖర్చు తగ్గడమే కాకుండా, బరువు కూడా 15 శాతం వరకు తగ్గుతుందని కంపెనీ చెప్తోంది. దీనివల్ల కార్లలోని ఎలక్ట్రానిక్ సిస్టమ్ చాలా కాంపాక్ట్‌గా, సులభంగా మారుతుంది. అయితే ఈ అధునాతన ADAS సిస్టమ్‌ను మొదట ఏ కార్లలో పరిచయం చేస్తారనేది సుజుకీ ఇంకా స్పష్టం చేయలేదు. మారుతీ సుజుకీకి చెందిన చిన్న కార్ల విషయానికి వస్తే ఆల్టో, వ్యాగన్ ఆర్ వంటివి ఎంట్రీ లెవల్లో ఉన్నాయి. కానీ వీటిలో వెంటనే ADAS ఫీచర్ ఇచ్చే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. బహుశా మారుతీ సుజుకీ బలైనో, ఫ్రాంక్స్ వంటి కాంపాక్ట్ మోడల్స్ నుంచి ఈ ADAS ఫీచర్‌ను మనకు అందుబాటులోకి తీసుకురావొచ్చని భావించవచ్చు.