
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆ మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేయబోతోందా? పాత సక్సెస్ ఫార్ములాను కొత్తగా తెర మీదికి తీసుకొచ్చి తిరుగులేని విజయం సాధించాలనుకుంటోందా? అదే నిజమైతే… మాకంటే మాకంటూ ప్రస్తుతం టిక్కెట్ ఆశిస్తున్న పార్టీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టేనా? ఏంటా ఫార్ములా…? ఏదా మున్సిపల్ కార్పొరేషన్? కొత్తగా తెరపైకి వచ్చిన పేర్లేవి? ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న క్రమంలో… గుంటూరు కార్పొరేషన్ స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. రాజధాని అమరావతి విజయవాడకు దగ్గరగా ఉన్నా… టెక్నికల్‌గా గుంటూరు జిల్లా పరిధే. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అంతా.. ఈ జిల్లా లిమిట్స్‌లోనే నివాసం ఉంటున్నారు. ఇలా… రకరకాల కేలిక్యులేషన్స్‌తో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయట అన్ని పార్టీలు. ఈ క్రమంలో… ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయాలన్న పట్టుదలతో అప్పుడే పావులు కదుపుతున్నారట కూటమి నాయకులు. అందులోనూ… టీడీపీ హై అలర్ట్‌గా ఉందని అంటున్నారు. అయితే… ఆ పార్టీ అధిష్టానం ఆలోచన అంటూ తాజాగా మొదలైన ప్రచారం తెలుగు తమ్ముళ్ళను తెగ టెన్షన్ పెడుతోందట. మున్సిపాలిటీగా ఉన్న గుంటూరు 1994లో కార్పొరేషన్ అయింది. 95లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మొత్తంగా… గుంటూరు కార్పొరేషన్‌కు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎలక్షన్స్ జరిగితే… రెండు విడతలు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్, మరోసారి వైసీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక తాజా పొలిటికల్ హీట్‌తో టీడీపీలో మేయర్ సీటుకోసం పోటీ తీవ్రస్థాయిలో ఉంది.
సామాజికవర్గాల వారీగా… ఎవరికి వారు తమకు అనుకూలమైన లెక్కలు చెప్పుకుంటూ… ఎవరికి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారట. కమ్మ సామాజికవర్గం తరపున మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర మరోసారి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు కేవలం ఏడాదిపాటే మేయర్‌గా ఉండడంతో మరోసారి అధిష్టానం తనకు అవకాశం ఇస్తుందని భావిస్తున్నారట ఆయన. ఇక అదే సామాజికవర్గానికి చెందిన సీనియర్ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరాం ప్రసాద్, మన్నెం శివనాగమల్లేశ్వరావు, మాదల చైతన్యతోపాటు గతంలో గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్ పదవి ఆశించిన సుఖవాసి శ్రీనివాసరావు కూడా మేయర్ సీటు రేస్‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక కాపు కోటాలో ఏపీఐఐసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్ సీటు ఆశిస్తున్నారు. అదే సమయంలో ఒకవేళ మేయర్ సీటు బీసీలకు కేటాయిస్తే తనకు అవకాశం ఇవ్వాలంటూ మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఇలా… టీడీపీలో మేయర్ సీటుకోసం ఎవరికి వారు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే…. అదంతా తూచ్…..ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నా, ఎంత గింజుకున్నా ఉపయోగం లేదు, అసలు ప్లానింగ్ వేరే ఉందంటూ మొదలైన కొత్త ప్రచారం ఆశావహులందరికీ దడ పుట్టిస్తోందట. టీడీపీ అధిష్టానం అనుహ్యంగా కొత్త అభ్యర్ధిని తెర మీదికి తీసుకు రావచ్చన్నది ఆ ప్రచారం సారాంశం.
ఆశావహుల టెన్షన్‌లో అర్ధం ఉందని, గత అనుభవాలే అందుకు ఉదాహరణ అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. గుంటూరు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారిన తర్వాత మొదటి సారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రయోగం చేసింది. అంతకు ముందు రాజకీయ అనుభం లేని, డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న కొల్లి శారదను అప్పుడు మేయర్ అభ్యర్ధిగా బరిలోకి దించారు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు. ఈ పరిణామాన్ని ఎవరూ ఊహించలేదు. ప్రయోగం సక్సెస్ అయి… ఆ ఎన్నికల్లో కొల్లి శారద మేయర్ అయ్యారు కూడా. తిరిగి 2000లో జరిగిన ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. లెక్చరర్‌గా ఉన్న చుక్కా ఏసురత్నంను టీడీపీ తరపున మేయర్ అభ్యర్దిగా బరిలోకి దింపారు. రెండోసారి కూడా మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక 2005లో పార్టీ నేత, రియల్టర్ యాగంటి దుర్గారావును బరిలో దించి ఓడిపోయింది టీడీపీ. నాలుగోసారి 2021లో మరోసారి మేయర్ అభ్యర్దిగా కోవెలమూడి రవీంద్రను టీడీపీ ప్రకటించింది.
ఆ ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యింది. ఈ లెక్కన చూసుకుంటే… పార్టీ నాయకుల్ని మేయర్ అభ్యర్థులుగా పెట్టిన రెండు సార్లు ఓడిపోయింది, ఫ్రష్ ఫేస్‌లను బరిలో దింపిన రెండు సార్లు విజయం సాధించింది టీడీపీ. ఇదే ఆశావహుల్లో టెన్షన్‌కు కారణం అవుతోందట.అధికారంలో ఉన్నందున మున్సిపల్ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అధ్యక్షుడు చంద్రబాబు పాత సక్సెస్ ఫార్ములాను కొత్తగా అమలు చేస్తే… మా పరిస్థితి ఏంటన్నది వాళ్ళ కంగారు. పైగా అది కేవలం ప్రచారంలా కాకుండా… ఫలానా అభ్యర్థి అంటూ… గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వైద్యురాలి పేరు తెర మీదికి వచ్చింది. ఆమె నిర్మించిన ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు కూడా. దీంతో ఈ ప్రచారానికి మరింత ఊతం వచ్చినట్లయ్యింది. ఆ వైద్యురాలితోపాటు పొగాకు వ్యాపారం చేస్తున్న మరో బడా బిజినెస్ మ్యాన్ పేరు కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో తిరుగుతోంది. ఆ రకంగా మొత్తం మీద గుంటూరు మేయర్ టీడీపీ అభ్యర్థి చుట్టూ రకరకాల చర్చలు జరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి.