Reading Time: 2 minutes

మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్ జోన్లలో  అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై ఎంఎంసీ  కొరడా

Caption of Image.

హైదరాబాద్: అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, నాలాలు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించేందుకు ఎంఎంసీ అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్ జోన్ల పరిధిలో టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పలు అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించారు.

మల్కాజిగిరి జోన్‌లో చర్యలు

బోయిన్‌పల్లి ఫతేనగర్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన మూడో అంతస్తుపై తొలగింపు చర్యలు చేపట్టారు. మౌలాలి పరిధిలో 51 ఆక్రమణలను తొలగించారు. కాప్రా సైనిక్‌పురి–నిర్మల్ నగర్ మార్గంలో 31 ఆక్రమణలను తొలగించారు.వెస్ట్రన్ బ్లిస్ ప్రాంతంలో ప్రజా రహదారిపై నిర్మించిన అక్రమ గేట్లను తొలగించారు. నాచారం అన్నపూర్ణనగర్‌లో అనధికార నిర్మాణంపై చర్యలు తీసుకున్నారు.

ఉప్పల్ జోన్‌లో ఆక్రమణల తొలగింపు

నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి నాలా చెరువు వరకు ఉన్న ప్రాంతంలో 15 షెడ్లు, గుడిసెలను తొలగించారు. చెంగిచెర్ల కాకతీయనగర్‌లో అనధికారంగా నిర్మించిన మూడో అంతస్తును తొలగించారు.ఘట్‌కేసర్ యామ్నంపేట్‌లో అనధికార మూడో, నాలుగో అంతస్తులపై చర్యలు చేపట్టారు. రాంపల్లి–చెర్లపల్లి రోడ్డులో అనధికార షెడ్‌ను తొలగించడంతో పాటు రాంపల్లి ఎక్స్‌రోడ్స్ వద్ద అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను తొలగించారు.యామ్నంపేట్‌లో అనధికార నాలుగో, ఐదో అంతస్తులపై కూడా చర్యలు చేపట్టారు. కుంట్లూర్‌లో అనధికార మూడో అంతస్తు పిల్లర్లను తొలగించగా, పెద్ద అంబర్‌పేట్‌లోనూ అక్రమ నిర్మాణానికి సంబంధించిన పిల్లర్లను తొలగించారు.

ఎల్‌బీనగర్ జోన్‌లోనూ విస్తృత చర్యలు

సరూర్‌నగర్‌లో 20 ప్రొజెక్షన్లు, 10 షెడ్లు, 5 స్టాళ్లను తొలగించారు. ఎల్‌బీనగర్‌లో ప్రతిపాదిత 200 అడుగుల రోడ్డు విస్తరణ కోసం 191.97 చదరపు గజాల స్థలాన్ని అప్పగించారు.హయత్‌నగర్‌లో 12 ర్యాంపులు, 22 షెడ్లు కలిపి మొత్తం 34 ఆక్రమణలను తొలగించారు.

►ALSO READ |  సున్నం చెరువు, తుమ్మిడి కుంట చెరువుల చుట్టూ..  ఫుట్‌పాత్‌లు, లైటింగ్.. రోడ్డు కనెక్టివిటీ

తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఆక్రమణలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై నిరంతర చర్యలు చేపట్టాలని సూచించారు.

రోడ్లు, నాలాలు, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ప్రజా రహదారుల పరిరక్షణ, డ్రైనేజీ వ్యవస్థ సక్రమ నిర్వహణ, పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఎంఎంసీ చర్యలు కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.