Reading Time: 3 minutes
Story Board Over Cyber Attacks

టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ.. సైబర్ నేరాలు కూడా అంతకంతకూ విస్తరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ.. వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలో నమోదయ్యే ప్రతి నాలుగు కేసుల్లో ఒకటి సైబర్ నేరమే. అలాగే ప్రతి పది మందిలో నలుగురు సైబర్ బాధితులే ఉన్నారంటే.. సైబర్ నేరాలు ఎంతగా చొచ్చుకుపోయాయో అర్థమౌతోంది. ఓవైపు పోలీసులు సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నా.. మరోవైపు సైబర్ నేరాలపై అవగాహన కలిగిస్తున్నా కూడా.. నేరాలు పెరగటానికి అత్యాశ, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఒక్క ప్రాంక్ కాల్.. కోట్ల రూపాయలు ఇచ్చేస్తారు. ఓ అమ్మాయి గొంతు వింటే చాలు.. ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారైనా ఐసైపోయి.. ఎన్ని డబ్బులైనా ఇచ్చేస్తున్నారు. సైబర్ నేరాలన్నింటిలో కామన్‌గా కనిపించేది ఒక్కటే. మొదట అత్యాశతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని లబోదిబోమనటం. మొదట్లో అవగాహన లోపంతో సైబర్ నేరాలు జరిగేవి కానీ.. ప్రస్తుతం మాత్రం చాలావరకు అవగాహన ఉన్నవారే ఈజీగా మోసపోతున్నారు.

సైబర్ నేరాల్ని ఇప్పటిదాకా చూసిన కోణానికీ.. ఇకపై చూసే కోణానికీ కచ్చితంగా తేడా ఉంది. ఎందుకంటే మొన్నటిదాకా సైబర్ నేరాల గురించి చాలా మందికి పూర్తి అవగాహన లేదు. కాబట్టి బాధితుల్ని చూసి జాలిపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కొంతకాలంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు, ఆర్బీఐ దగ్గర్నుంచీ పోలీసుల దాకా.. లెక్కలేనన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇంత చేస్తున్నా కూడా.. ఉన్నత విద్యావంతులే ఎక్కువగా సైబర్ వలలో చిక్కటం కచ్చితంగా నిర్లక్ష్యమేననే వాదన క్రమంగా బలపడుతోంది. ఓ డాక్టర్ లేడీ వాయిస్ విని ఫ్లాటైపోయి.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.14 కోట్లు పోగొట్టుకున్నారు. తీరా ఆరాతీస్తే.. అసలా లేడీ లేడీనే కాదనే అనుమానాలొస్తున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, టెలిగ్రాంలలో మహిళల ఫేక్ ప్రొఫైళ్లు సృష్టిస్తున్న కేటుగాళ్లు.. ఏఐ సాయంతో ఆకర్షణీయమైన లేడీ వాయిస్‌ను కూడా సృష్టిస్తున్నారు. అంతే మాట్లాడేది ఎవరో.. ఎందుకో కూడా చూసుకోకుండా.. అవతల మహిళ కంఠం వినపడగానే.. టెంప్ట్ అయిపోతున్న బాధితులు.. ఏం చెబితే అది చేస్తూ.. ఎంత అడిగితే అంత ఇచ్చుకుంటున్నారు. అలాగని వీరేం అవగాహన లేని వారు కాదు. మరి ఇలాంటి వారిని చూసి జాలిపడాలా.. ఇంకేం చేయాలి అనేది పోలీసులకూ అంతుచిక్కడం లేదు. అన్నీ తెలిసీ ఇలా ఎందుకు చేశారంటే.. నిజమే అనుకున్నాం అనే రెడీమేడ్ సమాధానం విని.. అధికారులకూ విసుగొస్తోంది. అసలు నమ్మశక్యం గాని లాభాలు, అపరిచిత మహిళల మాటలు ఎలా నమ్ముతారనేది ఏ లాజిక్‌కూ అందని విషయం. సొంత బుర్ర పనిచేయనంతగా.. లేడీస్ వాయిస్‌ కు టెంప్ట్ అవుతున్నారా అనేది ఆలోచించాల్సిన విషయం.

సైబర్ ప్రపంచం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సైబర్ నేరగాళ్లు సైబర్ క్షేత్రాన్ని దుర్వినియోగం చేసి ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న సైబర్ నేరస్తులు మన నెట్టింట్లో ప్రవేశించి మన బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు. మన ప్రైవసీని దెబ్బ తీస్తున్నారు. కంప్యూటర్ ముందు మీటలు నొక్కుతూ అంతరిక్షంలోని కృత్రిమ ఉపగ్రహాల వ్యవస్థను ఛిద్రం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఒక్క బటన్ నొక్కితే శత్రు దేశంలో అణ్వాయుధాలు రీప్రొగ్రామింగ్ జరిగి విధ్వంసం జరిగే ప్రమాదమూ ఉంది. కంప్యూటర్ వ్యవస్థలను విధ్వంసం చేసి అత్యంత సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ పేరుతో ఆడవాళ్ల మీద లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ తో చెలరేగిపోతున్నారు. భవిష్యత్ లో దేశాల మధ్య యుద్ధాలకు సైబర్ క్షేత్రాలే వేదికలవుతాయనడానికి ఇప్పటికే అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ నేరాల భవిష్యత్ ముఖచిత్రం ప్రపంచాన్ని భయపెడుతోంది.

సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్న తొలి 5 దేశాల్లో భారత్ ఒకటని సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ సంస్థ సిమాంటిక్ వెల్లడించింది. నేరగాళ్ల నైపుణ్యం పెచ్చుమీరుతోందని రాన్సమ్ వేర్, ఫిషింగ్ ద్వారా అధిక నేరాలకు పాల్పడుతున్నారు.66 శాతం మంది స్మార్ట్ ఫోన్, నోట్ బుక్ వంటి మొబైల్ పరికరాలను వ్యక్తిగత అవసరాలతో పాటు కార్యాలయ విధులకు వినియోగిస్తున్నారని వెల్లడించిన నివేదిక, దీనివల్ల సైబర్ నేరగాళ్లు సులువుగా సంస్థలకు నష్టం చేకూర్చగలుగుతున్నారని వివరించింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో 63 మంది ఏదో ఒక రూపంలో సైబర్ నేరస్తుల బారిన పడుతున్నారని తెలిపింది.

దేశంలో ఏటా 42 లక్షల సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. ప్రతి పది మందిలో నలుగురు సైబర్ నేరాల బారిన పడుతున్నారు. నిమిషానికి 80 మంది ఈ-నేరాల వలలో చిక్కుకుంటున్నారు. వీటివల్ల ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న నష్టం 11000 కోట్ల డాలర్లు. ఇది వ్యక్తిగత స్థాయిలో జరుగుతున్న నష్టం మాత్రమే. ఎరవేసి డబ్బు లాగే స్పామ్ దాడుల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. వైరస్ దాడుల్లో రెండో స్థానంలో ఉంది. అన్ని రకాల సైబర్ నేరాల్లో మూడో స్థానంలో ఉంది.

దేశంలో ఆన్‌లైన్ లావాదేవీల వ్యాపారమూ శరవేగంగా విస్తరిస్తోంది. అందుకే లాటరీ తగిలిందని తప్పుడు మెయిల్ పంపించి పెద్దఎత్తున డబ్బు కొల్లగొట్టే నైజీరియన్ మోసాల సంఖ్య ఎక్కువవుతోంది. రూ.కోట్ల విలువ చేసే లాటరీ కలిసిందని చెప్పగానే వెనకాముందు ఆలోచించకుండా అడిగినంత డబ్బు మాయగాళ్ల ఖాతాల్లో డిపాజిట్ చేసేవారి సంఖ్యకూ కొదవలేదు.విదేశాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాలపై అక్కడి ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. దీంతో ఇప్పుడు మన పోలీసులకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. అక్కడ సైబర్‌ నేరాలకు అలవాటు పడ్డ ముఠాలు ఇటువైపు ఎక్కడ వస్తారో అన్న సందేహమే ఇందుకు కారణం. ఇప్పుడు వీరి చూపు మన దేశంపై పడిందన్న నిఘా వర్గాల సమాచారం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.కాంబోడియా, మయన్మార్‌ దేశాలను అడ్డాలుగా చేసుకొని గత కొన్నేళ్లుగా సైబర్‌ ముఠాలు చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ ముఠాలు ప్రజలను దోచుకుంటున్నా.. ఎక్కువగా నష్టపోతుంది భారతీయులే. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువకులకు ఎర వేస్తున్న సైబర్‌ ముఠాలు.. వారికి మాయమాటలు చెప్పి బలవంతంగా వారితో సైబర్‌ నేరాలు చేయిస్తున్నారు.

గతంలో దొంగలు పడితే…ఇళ్లను గుల్ల చేసేవారు. ఒక చోరీ చేయాలంటే పక్కా ప్లాన్‌ ప్రకారం…కన్నం వేసి ఉన్నదంతా దోచేసేవారు. ఇంట్లో ఉన్న బంగారంతో పాటు డబ్బును ఎత్తుకెళ్లేవారు. దీంతో దొంగల నుంచి డబ్బు, బంగారాన్ని సేఫ్‌గా ఉంచుకునేందుకు…జనం బ్యాంక్‌లవైపు మళ్లారు. బ్యాంక్‌లో అయితే తమ సొమ్ము సేఫ్‌గా ఉంటుందని…అకౌంట్లు తెరిచి ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. గతంలో తమ డబ్బు ఎక్కడికి పోదని…గుండెమీద చేయి వేసుకొని నిద్రపోయేవారు. ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది. కొత్త కొత్త ఆప్షన్స్‌ వచ్చాయి. జనం కాలు కదపకుండా అన్ని ఇంటికి వచ్చేస్తున్నాయి. జస్ట్‌…తమ చేతిలో ఉన్న ఫోన్‌లో యాప్‌ను ఓపెన్‌ చేసి…ఆర్డర్‌ పెడితే చాలు…డైపర్‌ నుంచి హెయిర్‌ డ్రయ్యర్‌ దాకా…ఇంటికి డెలివరీ అవుతున్నాయి.

కరెంట్‌ బిల్ కట్టాలన్నా…మున్సిపాల్టీకి ట్యాక్స్‌లు కట్టాలన్నా…ఫోన్‌ బిల్ కట్టాలన్నా…ఇంకెవరికైనా డబ్బు పంపాలన్నా…బ్యాంక్‌కు వెళ్లి డబ్బు డ్రా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. స్మార్ట్‌ వర్క్‌ పెరిగిపోయింది. అన్నింటికి చేతిలో ఉన్న ఫోన్‌నే వాడేస్తున్నారు. జస్ట్‌ ఒక్క క్లిక్‌తో డబ్బు పంపాల్సిన వారికి పంపుతున్నారు. అంతా టెక్నాలజీ మాయ. స్మార్ట్‌ నెస్‌ పెరుగుతున్న కొద్దీ…నేరాలు కూడా అంతే స్మార్ట్‌గా జరుగుతున్నాయి. గతంలో డబ్బు ఇంట్లో పెట్టుకుంటే దొంగలు కొట్టేస్తారన్న భయంతో బ్యాంక్‌ల్లో జమ చేసుకునేవారు. ప్రస్తుతం బ్యాంక్‌లో ఉన్న డబ్బు కూడా సేఫ్‌ కాదనే రోజులు పోయాయి. టెక్నాలజీ సాయంతో సైబర్‌ నేరగాళ్లు…స్మార్ట్‌గా…మొబైల్‌కు ఓటీపీ లేదా లింక్‌ పంపి సొమ్ము కొల్లగొడుతున్నారు. లింక్‌పై క్లిక్‌ చేసినా…ఓటీపీ చెప్పినా…ఇక అంతే సంగతులు. మీ అకౌంట్లో ఉన్న సొమ్ము క్షణాల్లో ఖాళీ అవుతోంది. ప్రస్తుతం బ్యాంక్‌ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ ఫోన్‌ కూడా ఉంది. ఇదే సైబర్‌ కేటుగాళ్లకు వరంగా మారుతోంది.