
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో రైతుల సమస్యలపై మాట్లాడే ముందు కేటీఆర్ తన పదేళ్ల పాలనలో రైతుల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతులకు సంబంధించిన అంశాలపై కేటీఆర్ పదేపదే కాంగ్రెస్ ఎంపీలను ప్రశ్నిస్తున్నారని, అయితే తన హయాంలో రైతుల సమస్యల పరిష్కారానికి చేసిన కృషిని కూడా ఆయన వివరించాలని వంశీకృష్ణ అన్నారు.
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్) అంశాన్ని ప్రస్తావించిన ఎంపీ వంశీకృష్ణ.. ఎరువుల సమస్య, యూరియా కొరత వంటి అంశాలపై గతంలో కేటీఆర్ చట్టసభల్లో ఎప్పుడైనా ప్రస్తావించారా అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆయన ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఏం చేశారు? యూరియా కష్టాలు తీర్చేందుకు ఏం ప్రయత్నించారు? ఆర్ఎఫ్‌సీఎల్ గురించి చట్టసభల్లో ఎప్పుడైనా మాట్లాడారా?’’ అని వంశీకృష్ణ ప్రశ్నించారు.
తెలంగాణ రైతుల సమస్యలపై కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని వంశీకృష్ణ విమర్శించారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, ఎంపీలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రశ్నలు సంధించే ముందు గతంలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమాధానం చెప్పాలని అన్నారు.
కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, ‘‘చేసేది కబ్జాలు, దోపిడీలు.. కానీ మాటలు మాత్రం యువరాజుల్లా మాట్లాడుతారు’’ అని వంశీకృష్ణ వ్యాఖ్యానించారు. ‘‘లూజర్ ఆఫ్ అపోజిషన్‌కు మించి కేటీఆర్ ఏం కాలేరు’’ అంటూ విమర్శించారు.