Reading Time: 2 minutes
Rajamouli Comments Dont Trouble The Trouble Fahadh Faasil

ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వేదికపై మాట్లాడిన విషయాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకొని ఫహాద్ ఫాజిల్, దర్శకుడు శశాంక్ ఏలేటి, చిన్నారి సారా , తన కుమారుడు కార్తికేయల గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

తమ్ముడి లాంటి తారక్‌కి థ్యాంక్స్ చెప్పను.. ‘డ్రాగన్’ సమయానికే వస్తుంది

తారక్ ఈ ఈవెంట్‌కు రావడంపై రాజమౌళి స్పందిస్తూ, సొంత తమ్ముడికి కృతజ్ఞతలు చెబితే అస్సలు బాగుండదని వ్యాఖ్యానించారు. తారక్ నటిస్తున్న ‘డ్రాగన్’ చిత్రం కోసం తాను కూడా తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నానని చెప్పారు. రెక్కలు విప్పుకుని, గోర్లు చాచి నిప్పులు కక్కే డ్రాగన్ ఎలా ఉండబోతుందో తాను ఇప్పటికే చిన్న డ్రిల్ చూశానని, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాదని, కచ్చితంగా అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టం చేశారు.

మారుమూల పల్లెల్లోనూ ‘ఫాఫా’ మేజిక్.. శశాంక్ వన్ లైనర్ తో షాక్

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (ఫాఫా) గురించి చెబుతూ, తాను అతడిని కాస్త ఆలస్యంగానే గుర్తించానని రాజమౌళి అన్నారు. ఒక మారుమూల గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహిళ తన వద్దకు వచ్చి ఫాఫా సినిమాలు చూస్తారా అని అడగడం, ఆయన షార్ట్ కట్ పేరు కూడా ఆమెకు తెలిసి ఉండడం చూసి మన ఆడియెన్స్‌కు ఆయన ఎంత దగ్గరయ్యాడో అర్థమైందన్నారు. ఫహాద్ నటించిన ‘ట్రాన్స్’ సినిమా తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. అలాగే దర్శకుడు శశాంక్ ఏలేటి తన వద్దకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు ‘నాకు మూడు గంటలు టైమ్ లేదు, ఒక్క లైన్లో చెప్పు’ అంటే.. “ఒక దెయ్యాన్ని కిడ్నాప్ చేసిన మనిషి కథ” అని చెప్పాడని గుర్తుచేసుకున్నారు. దాంతో తన మైండ్‌లో వందలాది ప్రశ్నలు రేకెత్తి, దెయ్యాన్ని ఎలా కిడ్నాప్ చేశాడనే కుతూహలంతో ఆసక్తిగా మూడు గంటల పాటు కథ విన్నానని వెల్లడించారు.

సినిమా చూసి ఏడ్చాను.. ఇది ప్రతి ఒక్కరిలో ఉన్న పిల్లల కోసం తీసిన సినిమా

తాను ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశానని రాజమౌళి తెలిపారు. సినిమాలో చాలా సేపు నవ్వుకున్నానని, అలాగే చాలా సేపు ఏడ్చానని చెప్పారు. ఎంతగా ఏడ్చానంటే తన కళ్లు ఉబ్బిపోయి భార్య కూడా షాక్ అయిందని ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్‌కు పోటీగా చిన్నారి సారా నటనతో అదరగొట్టిందని ప్రశంసించారు. ఇక తన కుమారుడు కార్తికేయ గొప్ప బిజినెస్ మ్యాన్ అని, తనకు రూపాయి రావడం ఎంత ముఖ్యమో, తనతో పాటు ఉన్నవాళ్లకు కూడా లాభం రావాలని కోరుకునే మనస్తత్వం అతడిదని చెప్పారు. ఈ సినిమాలో చిన్నపిల్ల ఉంది అనగానే ఇది పిల్లల సినిమా అని అనుకోవద్దని, మనందరిలో ఉండే చిన్నపిల్లల మనస్తత్వానికి కనెక్ట్ అయ్యే అద్భుతమైన సినిమా ఇదని రాజమౌళి పేర్కొన్నారు.