
RBI FD Rules 2026: బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారికి కీలక మార్పు రానుంది. అక్టోబర్ 1, 2026 నుంచి బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ రేట్ల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసే ఖాతాదారులకు వడ్డీ రేట్ల విషయంలో మరింత పారదర్శకత కల్పించడమే..
ప్రతిరోజూ వడ్డీ రేట్లు వెల్లడించాలి
కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు ప్రతి పనిదినం బల్క్ ఎఫ్‌డీలపై వర్తించే వడ్డీ రేట్లను తమ వెబ్‌సైట్‌లో వెల్లడించాల్సి ఉంటుంది. బ్యాంకులు ఉదయం 10 గంటలలోపు ఆ రోజు వడ్డీ రేట్లను అప్‌డేట్ చేయాలి. ఇందుకోసం ఉదయం 10.10 గంటల వరకు అదనపు గడువు కూడా ఉంటుంది. ఆ రోజు బల్క్ ఎఫ్‌డీ చేసిన ఖాతాదారులకు వెబ్‌సైట్‌లో ప్రకటించిన రేట్లే వర్తించనున్నాయి. అయితే, ఈ నిబంధనలు ప్రధానంగా బల్క్ డిపాజిట్లకు వర్తిస్తాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో సాధారణంగా రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బల్క్ డిపాజిట్‌గా పరిగణిస్తారు. అయితే ఇతర బ్యాంకుల వర్గాలను బట్టి బల్క్ డిపాజిట్ పరిమితులు భిన్నంగా ఉండవచ్చు. చిన్న మొత్తంలో సాధారణ ఎఫ్‌డీలు చేసే ఖాతాదారులపై ఈ ప్రత్యేక మార్పు నేరుగా ప్రభావం చూపదు. అంటే సాధారణ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను ప్రతిరోజూ ఇలా వెల్లడించాల్సిన నిబంధన బల్క్ డిపాజిట్లకు సంబంధించినదే.
బ్రాంచ్‌ల వారీగా వేర్వేరు రేట్లకు చెక్
కొత్త నిబంధనల్లో మరో ముఖ్యమైన అంశం ఉంది. ఒకే బ్యాంకులో ఒకే రోజున, ఒకే మొత్తానికి, ఒకే కాలపరిమితితో చేసే బల్క్ ఎఫ్‌డీలకు వివిధ శాఖలు తమ ఇష్టానుసారం వేర్వేరు వడ్డీ రేట్లు అందించే విధానానికి పరిమితులు విధించనున్నారు. అయితే, లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR)కు సంబంధించిన ప్రత్యేక నిబంధనల కారణంగా కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉండొచ్చు.
ఖాతాదారులకు ఏం ప్రయోజనం?
పెద్ద మొత్తంలో డబ్బును ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టే వ్యక్తులు, సంస్థలు ప్రతి పనిదినం బ్యాంకు వెబ్‌సైట్‌లో బల్క్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో వడ్డీ రేట్ల విషయంలో సమాచార లోపం తగ్గడంతో పాటు, బ్యాంకుల మధ్య రేట్లను పోల్చుకోవడం కూడా సులభం అవుతుంది. మొత్తంగా చూస్తే, కొత్త నిబంధనలు ప్రధానంగా బల్క్ ఎఫ్‌డీల వడ్డీ రేట్లను మరింత పారదర్శకంగా, క్రమబద్ధంగా వెల్లడించడంపై దృష్టి పెడుతున్నాయి. సాధారణ ఎఫ్‌డీ ఖాతాదారులు మాత్రం ఈ మార్పును తమ సాధారణ డిపాజిట్‌పై వర్తించే వడ్డీ రేటు మార్పుగా భావించాల్సిన అవసరం లేదు.