Reading Time: 2 minutes

డీఎంకే సంచలన నిర్ణయం.. ఇండియా కూటమికి గుడ్ బై

Caption of Image.

చెన్నై: ప్రతిపక్ష ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై చెప్పింది. ఇకపై ఇండియా కూటమిలో తాము భాగం కాదని తెలిపింది. కాంగ్రెస్‏తో విభేదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 30న కాంగ్రెస్ అధ్యక్షతన జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి హాజరు కావడం లేదని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

డీఎంకే ప్రతినిధి టి.కె.ఎస్. ఇలంగోవన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఇకపై డీఎంకే భాగం కాదని తెలిపారు. కాంగ్రెస్ తో విభేదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 30న జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి కూడా డీఎంకే హాజరు కాదని ఆయన తేల్చిచెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ తమతో బంధాన్ని తెంచుకుని అధికార టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చి మాకు ద్రోహం చేసిందని విమర్శించారు. 

కేవలం రెండు పదవుల కోసం ఆశపడి కాంగ్రెస్ డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. కాంగ్రెస్ తీరుతో ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు కూడా అసంతృప్తితో ఉన్నాయని.. సమావేశానికి వెళ్లేందుకు ఆ పార్టీలు కూడా విముఖత వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. అయితే, బీజేపీపై వ్యతిరేకత విషయంలో ఇండియా కూటమిలోని పార్టీలు భావజాలపరంగా ఐక్యంగానే ఉన్నాయని చెప్పారు. ఇండియా కూటమి సమావేశానికి హాజరుకానంత మాత్రాన ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు కాదని పేర్కొన్నారు. 

ఇండియా కూటమి కీలక సమావేశం

ఓటర్ల  జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విషయంలో ఈసీలో భేదాభిప్రాయాలు ఉన్నాయన్న వార్తలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలనే డిమాండ్‌తో పాటు ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియపై చర్చించేందుకు సెప్టెంబర్ 30న ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 

►ALSO READ | జమ్మూ కాశ్మీర్‌లో ఘోరం: తోటి జవాన్ కాల్పుల్లో నలుగురు CISF సిబ్బంది మృతి

కాంగ్రెస్‎తో విభేదాల నేపథ్యంలో డీఎంకే ఇండియా కూటమి నుంచి వైదొలగడంతో పాటు సమావేశానికి కూడా హాజరు కావడం లేదని తెలిపింది. ఇక, ముందస్తు షెడ్యూల్ కారణంగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఇండియా కూటమి సమావేశానికి హాజరు కావడం లేదు. సమాజ్ వాదీ పార్టీ తరుఫున సీనియర్ నేత ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

©️ VIL Media Pvt Ltd.