
- ట్రాప్‌లో స్వర్ణం గెలిచిన తొలి విమెన్ షూటర్‌గా రికార్డు
- టీమ్ విభాగంలో సిల్వర్ మెడల్
- 4×400 మీ. రిలేలో బంగారు పతకం
నగోయా: ఓవైపు భారీ వర్షం.. మరోవైపు పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. మధ్యలో బలమైన పోటీదారులు.. ఈ అడ్డంకులను ఏమాత్రం లెక్కచేయకుండా అద్భుతమైన గురితో ఆకట్టుకున్న ఇండియా షూటర్ నీరూ దండా.. ఆసియా క్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించింది. 48 ఏళ్ల తర్వాత విమెన్స్ ట్రాప్ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి ఇండియన్ విమెన్ షూటర్‌గా రికార్డులకెక్కింది. మంగళవారం జరిగిన ట్రాప్ ఫైనల్లో నీరూ 30 లక్ష్యాలకుగాను 28 టార్గెట్స్‌ను ఛేదించి టాప్ ప్లేస్‌లో నిలిచింది. చైనా షూటర్ సన్ యునాంగ్ (26), కువైట్ షూటర్ అబ్దుల్ మాలిక్ హజార్ (21) వరుసగా సిల్వర్, బ్రాంజ్‌ను సొంతం చేసుకున్నారు. వర్షం వల్ల షూటింగ్ రేంజ్ మొత్తం తడిసి ముద్దయింది. దాంతో వెలుతురు లేమితో గాలిలో ఎగిరే క్లే టార్గెట్‌లను గమనించడం అత్యంత కష్టంగా మారినా.. నీరూ మాత్రం గురి తప్పకుండా బుల్లెట్లు పేల్చి ఇండియా షూటింగ్ చరిత్రలో ఒక మైలురాయిని అందుకుంది.
ఆసియా క్రీడల విమెన్స్ ట్రాప్ విభాగంలో ఇండియాకు ఇదే తొలి వ్యక్తిగత పతకం కాగా, ఈసారి షూటింగ్‌లోనూ ఇదే తొలి వ్యక్తిగత స్వర్ణం కావడం మరో విశేషం. 1978లో బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో మెన్స్ ట్రాప్ విభాగంలో రణధీర్ సింగ్ ఇండియాకు తొలి బంగారు పతకాన్ని అందించాడు. ఆ తర్వాత 2010 గ్వాంగ్‌జౌ గేమ్స్‌లో రంజన్ సోధీ డబుల్ ట్రాప్‌లో స్వర్ణం గెలిచాడు. ఇప్పుడు గోల్డ్ మెడల్‌తో నీరూ విమెన్స్ షూటింగ్‌లో కొత్త అధ్యాయానికి తెరతీసింది. ఏషియాడ్‌కు 10 రోజుల ముందు తీవ్రమైన అనారోగ్యంతో ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న నీరూ బరిలోకి దిగడంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. కానీ వ్యక్తిగత కోచ్ మన్షెర్ సింగ్ సాయంతో అనారోగ్యాన్ని అధిగమించి పతకంతో మెరిసింది. ఇక టీమ్ విభాగంలో నీరూ, ఆషిమా అహ్లావత్, మనీషా కీర్‌తో కూడిన ఇండియా ట్రాప్ త్రయం సిల్వర్ మెడల్‌ను సాధించింది. క్వాలిఫికేషన్స్‌లో నీరూ (118), ఆషిమా (106), మనీషా (104) మొత్తం 328 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచారు. చైనా (346), కువైట్ (325) వరుసగా గోల్డ్, బ్రాంజ్‌ను సాధించాయి.