Reading Time: < 1 minute

తిరుమల భద్రతపై స్పెషల్ ఫోకస్.. అక్టోపస్ కమాండోల హై-వోల్టేజ్ డ్రిల్

Caption of Image.

తిరుమలలో భద్రతా చర్యల్లో భాగంగా అక్టోపస్ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడి వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎలా స్పందించాలి.. భక్తులను ఎలా కాపాడాలనే అంశాలపై శ్రీకృష్ణ గెస్ట్ హౌస్‌లో ఈ మాక్ డ్రిల్ చేపట్టారు. పోలీసులతో పాటు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, మెడికల్ విభాగాల సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.

తిరుమలలో భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా మంగళవారం (సెప్టెంబర్ 29) మధ్యాహ్నం శ్రీకృష్ణ గెస్ట్ హౌస్‌లో అక్టోపస్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుమల అడిషనల్ ఎస్పీ ఐ. రామకృష్ణ, టీటీడీ అధికారుల ఆదేశాల మేరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది.

అక్టోపస్ డీఎస్పీ జి. విశ్వనాథం, తిరుమల టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీరాములు, ఎస్‌ఐ మురళి, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, మెడికల్ విభాగం సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గెస్ట్ హౌస్‌పై ఉగ్రవాదులు దాడి చేసినట్లుగా పరిస్థితిని సృష్టించి.. అలాంటి అత్యవసర సమయంలో భద్రతా బలగాలు ఎలా స్పందించాలి, దాడిని ఎలా ఎదుర్కోవాలి, పరిస్థితిని ఎలా అదుపులోకి తీసుకురావాలి అనే అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు.

►ALSO READ | ఏఐతో తిరుమలలో రూమ్ బుక్ చేసుకోవచ్చా..? ఈ టెకీ ఏం చేశాడో చూడండి..!

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా స్పందించడం, వివిధ భద్రతా విభాగాల మధ్య సమన్వయాన్ని పరీక్షించడం లక్ష్యంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఇలాంటి భద్రతా విన్యాసాల ద్వారా భక్తుల్లో భరోసా కల్పించడంతో పాటు అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిబ్బందిని సన్నద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.