
- సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ సర్వేలో వెల్లడి
- 15 శాతం మంది విద్యార్థుల్లో తీవ్రమైన ఒత్తిడి
- 34% మందికి క్యాంపస్‌లో అపరిచితులమన్న భావన
న్యూఢిల్లీ: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో 9 శాతం మంది స్టూడెంట్లు గడిచిన ఏడాదికాలంలో ఆత్మహత్య ఆలోచనలు చేసినట్టుగా సుప్రీంకోర్టు నియమించిన టాస్క్ ఫోర్స్ సర్వేలో వెల్లడైంది. సుమారు15 శాతం మంది విద్యార్థులు గడచిన ఆరు నెలల్లో తాము తీవ్రమైన ఒత్తిడిని లేదా ఆందోళనను అనుభవించినట్టుగా ఈ సర్వేలో తెలిపారు. దాదాపు 34 శాతం మంది విద్యార్థులు క్యాంపస్‌లో తాము అపరిచితుల్లా ఉన్నామని భావిస్తున్నారు.
తీవ్రమైన సమస్యలను అడ్మినిస్ట్రేషన్ నిష్పక్షపాతంగా పరిష్కరిస్తుందని తమకు నమ్మకం ఉందని 56% మంది విద్యార్థులు చెప్పారు. తమ సంస్థ కౌన్సెలింగ్ సేవలను అందించడంలేదని 32% మంది తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సును పరిశీలించడానికి గత సంవత్సరం మార్చిలో సుప్రీంకోర్టు నేషనల్ టాస్క్ ఫోర్స్(ఎన్‌టీఎఫ్)ను ఏర్పాటు చేసింది.
జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ నేతృత్వం వహిస్తున్న ఈ టాస్క్ ఫోర్స్‌లో ప్రముఖ సైంటిస్టు అలోక్ సరిన్, మహిళా అభివృద్ధి అధ్యయన కేంద్రం మాజీ డైరెక్టర్ మేరీ ఇ జాన్, జాతీయ దివ్యాంగుల ఉపాధి ప్రోత్సాహక కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ, అమాన్ సత్య కచ్ఛ్రూ ట్రస్ట్ వ్యవస్థాపకుడు రాజేందర్ కచ్ఛ్రూ, నిమ్హాన్స్ క్లినికల్ సైకాలజీ ప్రొఫెసర్ సీమ మెహ్రోత్రా తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన 67 శాతంతో సహా మొత్తం 2.43 లక్షల మందికి పైగా విద్యార్థుల నుంచి సమాధానాలు సేకరించి నిర్వహించిన సర్వేలో టాస్క్ ఫోర్స్ ఈ మేరకు కీలక అంశాలను గుర్తించింది.
యూనివర్సిటీల్లో కుల, లింగ వివక్ష..
ఎన్‌టీఎఫ్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక మధ్యంతర నివేదికను సమర్పించింది. అందులో విద్యార్థుల ఉన్నత విద్య అనుభవం లోతుగా వేళ్లూనుకున్న సామాజిక వివక్ష, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలలో లైంగిక వేధింపులు, అకడమిక్ మద్దతు, హాస్టల్ కర్ఫ్యూలు, మోరల్ పోలీసింగ్ పరంగా మెడికల్, లా, రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో ఫ్యాకల్టీ ద్వారా లింగ వివక్ష, నీట్-యూజీ, జేఈఈ ర్యాంకుల ద్వారా కుల గుర్తింపు, ప్రవేశం, గ్రేడింగ్, భాషా అంతరాలు, ఫ్యాకల్టీ దృష్టి పరంగా కుల ఆధారిత అవమానం, వివక్ష వంటివి గుర్తించినట్టు ఈ నివేదికలో పేర్కొంది. విద్యార్థుల సర్వేతో పాటు, సంస్థాగత సందర్శనలు, విద్యార్థులతో సమావేశాలను ఎన్‌టీఎఫ్ నిర్వహించింది.
అయితే, సర్వే పరిధి తక్కువగా ఉన్నందున, ఈ ఫలితాలను పూర్తిస్థాయి అభిప్రాయాలుగా తీసుకోరాదని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వర్సిటీలలో ఫ్యాకల్టీ కొరత వల్ల అకడమిక్ మద్దతు తగినంత లేకపోవడం, డెంటల్, నర్సింగ్, మానసిక ఆరోగ్య విద్యా సంస్థలలో విద్యార్థులకు తక్కువ శిక్షణ, సూపర్‌వైజర్ల నిర్లక్ష్యం లేదా మితిమీరి నియంత్రణ వంటి సమస్యలను విద్యార్థులు ప్రస్తావించారు.
పెరుగుతున్న ఆత్మహత్యలు..
దేశవ్యాప్తంగా 2011–2022 మధ్య పదేళ్ల కాలంలో ఉన్నత విద్యాసంస్థల్లో ఎన్‌రోల్‌మెంట్స్ గణనీయంగా.. 2.92 కోట్ల నుంచి 4.33 కోట్లకు పెరిగాయి. మరోవైపు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం.. విద్యార్థుల ఆత్మహత్యల రేటు కూడా భారీగా పెరిగింది. ఉన్నత విద్యాసంస్థలలో ఎన్‌రోల్ అయిన ప్రతి లక్ష మంది విద్యార్థులకు ఆత్మహత్యల రేటు 2011లో 26.37గా ఉండగా.. అది 2022 నాటికి 30.02కు పెరిగిందని అధికారులు చెప్తున్నారు.