July 21, 2026

హైదరాబాద్‌ మహిళా ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు.. NPAలో తోటి బ్యాచ్ మెట్‌పై కేసు!

హైదరాబాద్‌ మహిళా ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు.. NPAలో తోటి బ్యాచ్ మెట్‌పై కేసు!
Reading Time: 2 minutes
హైదరాబాద్‌ మహిళా ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు.. NPAలో తోటి బ్యాచ్ మెట్‌పై కేసు!

హైదరాబాద్, జులై 20: కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల మహిళ ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆమె హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో ఉన్న నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (ఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్నారు. అదే అకాడమిలో ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్‌ కృష్ణారెడ్డి కూడా IPS శిక్షణలో ఉన్నాడు. ఉదయ్ ఈ ఏడాది జూన్‌ 23 నుంచి తనను వేధిస్తున్నాడని, తన వాట్సప్‌ నంబరుకు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళా ట్రైనీ ఐపీఎస్‌ ఆరోపించారు. అంతేకాకుండా తన గౌరవాన్ని దెబ్బతీసేలా అకాడమీలో ఇతరు ఎదుట తెలుగులో ఇబ్బందికరమైన పదజాలంతో అమర్యాదగా మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు.

అంతేకాకుండా జులై 8న బలవంతంగా అతడి గదిలోకి లాక్కెళ్లి బెదిరించి తన ఫోన్‌ పాస్‌వర్డ్‌ తీసుకున్నట్లు తెలిపారు. జులై 9న రాత్రి 9 గంటలకు మరోసారి తనను జుట్టు పట్టుకొని అతడి గదిలోకి గుంజుకెళ్లి గొంతు పిసికి, మెడపై కత్తి పెట్టి బెదిరించాడని, జులై 10న రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించడమేకాకుండా తన వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి భర్తకు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో విసుగు చెందిన ఆమె జులై 18న పోలీసులను ఆశ్రయించారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉదయ్‌ కృష్ణారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ అత్తాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉదయ్‌కృష్ణారెడ్డి అకాడమీలో ఇతరులతో తప్పుగా ప్రవర్తిస్తున్నట్లు, వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి తప్పుడు సందేశాలు పంపి కొందరిని మనోవేదనకు గురిచేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. దీంతో అతడి IPS ఉద్యోగ హోదాపై అనిశ్చితి నెలకొంది.

ఎవరీ ఉదయ్‌ కృష్ణారెడ్డి?

ఈ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న ఉదయ్‌ కృష్ణారెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామం. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఉదయ్‌.. నానమ్మ సాయంతో ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. కూరగాయలు అమ్ముతూ అతన్ని నానమ్మ పెంచి చదివించింది. కష్టపడి చదివి ఉదయ్‌ 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికై 2018 వరకు విధులు నిర్వర్తించాడు. ఆ సమయంలో ఓ సీఐ తోటి వారి ముందు ఉదయ్‌ను అవమానించడంతో భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌ వైపు అడుగులు వేశాడు. నాలుగు సార్లు ఫెయిలైనా పట్టుదలతో ఐదోసారి 360 ర్యాంకుతో యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌లో విజేతగా నిలిచాడు. అంతటి కష్టాలోడ్చి కలను సాకారం చేసుకున్న ఉదయ్‌పై అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.