Reading Time: 2 minutes
Mixer Jar Overheating Tips For Spices And Long Life

Kitchen Hacks : ఇంట్లో మసాలాలు రుబ్బుతున్నప్పుడు మిక్సీ జార్ తరచుగా వేడెక్కడం మనమంతా గమనించే ఉంటాం. మసాలాల గట్టిదనం, వాటి నుండి విడుదలయ్యే నూనెల వల్ల కలిగే ఘర్షణ కారణంగా జార్ త్వరగా వేడిని గ్రహిస్తుంది. దీనివల్ల మసాలాల రుచి పాడవ్వడమే కాకుండా, మిక్సీ మోటార్, జార్ బ్లేడ్‌లు త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనల ప్రకారం కూడా గ్రైండింగ్ సమయంలో పరికరాలు వేడెక్కకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ వేడి వల్ల మసాలాల్లోని సహజమైన సుగంధ తైలాలు ఆవిరైపోయి రుచి, సువాసన తగ్గిపోతాయి. ఈ సమస్యలను నివారించడానికి కొన్ని సులభమైన వంట చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

మసాలాలను పూర్తిగా చల్లబరచండి
బాగా వేయించిన మసాలా దినుసులు లేదా ఉల్లిపాయలను వేడిగా ఉన్నప్పుడే జార్‌లో వేసి రుబ్బితే లోపల ఆవిరి పుట్టి జార్ త్వరగా వేడెక్కుతుంది. అందుకే గ్రైండ్ చేయడానికి ముందు వాటిని కనీసం 10-15 నిమిషాల పాటు గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు పూర్తిగా చల్లారనివ్వాలి.

ఐస్ క్యూబ్స్ , చల్లటి నీటిని వాడండి
మసాలాలను పేస్ట్‌లా నూరుతున్నప్పుడు ఎల్లప్పుడూ చల్లటి నీటిని లేదా ఐస్ క్యూబ్స్‌ను ఉపయోగించండి. గోరువెచ్చని లేదా వేడి నీటిని పోస్తే జార్ ఉష్ణోగ్రత మరింత పెరిగి, లోపలి ఒత్తిడికి మూత ఎగిరిపోయే ప్రమాదం ఉంది. చల్లటి నీరు లేదా ఐస్ వాడటం వల్ల ఉష్ణోగ్రత అదుపులో ఉండటమే కాకుండా పదార్థాలు కూడా మెత్తగా నలుగుతాయి.

జాడీని నిండుగా నింపవద్దు
మిక్సీ జార్‌ను ఎప్పుడూ పైవరకు పూర్తిగా నింపకూడదు. మసాలాలు నూరడానికి, లోపల గాలి ఆడటానికి వీలుగా జార్‌ను ఎల్లప్పుడూ సగం లేదా ముప్పావు వంతు మాత్రమే నింపాలి. మీ వంటకు సరిపోయే సరైన పరిమాణం గల జార్‌ను ఎంచుకోవడం వల్ల కూడా వేడిని తగ్గించవచ్చు.

పల్స్ మోడ్ వాడకం.. చిన్న విరామాలు
మిక్సర్‌ను 10-15 నిమిషాల పాటు నిరంతరాయంగా నడపడం వల్ల జార్ , మోటార్ రెండు వేడెక్కుతాయి. అలా కాకుండా, మిక్సీని తక్కువ వేగంతో ప్రారంభించి, ఆపై వేగాన్ని పెంచాలి. నిరంతరం రన్ చేయకుండా 15 నుండి 30 సెకన్ల పాటు “పల్స్” మోడ్‌ను ఉపయోగిస్తూ, మధ్యమధ్యలో చిన్న చిన్న విరామాలు ఇస్తే జార్, బ్లేడ్‌లు చల్లబడతాయి.

మసాలాలు రుబ్బేటప్పుడు ఒక చేతిని మూతపై గట్టిగా ఉంచడం , గ్రైండింగ్ పూర్తయిన తర్వాత కాసేపు మిక్సీ ఆపి, మూత తెరిచి లోపలి వేడి గాలిని బయటకు పోనివ్వడం ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు.