Reading Time: < 1 minute
Actor Jagapathi Babu Interesting Comments On Acting Career Peddi Movie Promotions

Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు, వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు తన నటనతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, నటన గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నటుడు కాకపోతే మీరు ఏమయ్యేవారు? అనే ప్రశ్నకు జగపతి బాబు సమాధానమిస్తూ.. “నిజం చెప్పాలంటే నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం తెలియదు. ఆ విషయంలో నేను పూర్తిగా జీరో. నా లైఫ్‌లో, నా డిక్షనరీలోనే యాక్టింగ్ అనేదే లేదు అనుకుంటే నేను ఏమైపోయేవాడినో నాకే తెలియదు. నాకు బయట ఏదో చేసేయాలి, సాధించేయాలి అనే తపన కూడా అస్సలు ఉండదు. నాకున్న తపన, కసి అంతా ఒట్టి యాక్టింగ్‌లోనే చూపిస్తాను. నా తృప్తి అంతా నటనలోనే ఉంది” అని ఆయన చెప్పుకొచ్చారు.

కెరీర్‌లో ఒకే రకమైన పాత్రలు చేయడం తనకు అస్సలు నచ్చదని జగపతి బాబు స్పష్టం చేశారు. “నేను చేసిన పాత్రలనే మళ్లీ మళ్లీ చేస్తే నాకు బోర్ కొట్టేస్తుంది. అందుకే ఎవరైనా సరికొత్త పాత్రతో నా ముందుకు వస్తే కచ్చితంగా చేయాలనుకుంటాను. కొత్తదనం ఉంటేనే నాకు చేయడానికి బాగుంటుంది” అని అన్నారు. దర్శకులతో పనిచేసే విధానం గురించి మాట్లాడుతూ.. “కొత్త డైరెక్టర్ అయినా, సీనియర్ డైరెక్టర్ అయినా నేను వాళ్లను ఒకటే అడుగుతాను.. ‘నేను ఏం చేయగలనో పక్కన పెట్టండి, ఈ పాత్ర కోసం మీకేం కావాలో చెప్పండి’ అని అడుగుతాను. వాళ్ల విజన్ ఏంటో చెబితేనే పాత్రలో కొత్తదనం వస్తుంది. లేదంటే నేను గతంలో చేసిన యాక్టింగే మళ్లీ రిపీట్ అవుతుంది” అని అన్నారు. ఇకపోతే పెద్ది విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.