Reading Time: 2 minutes
పెరోల్‌పై జైలు నుంచి వచ్చి పరార్.. కట్‌చేస్తే బాలీవుడ్‌లో సెటిల్! అమితాబ్, అమీర్ ఖాన్, మోహన్ లాల్ సినిమాల్లో మెరిసన ఖైదీ

హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తూ.. పెరోల్‌పై బయటకు వచ్చిన ఓ వ్యక్తి చట్టం కళ్లుగప్పి తిరుగుతూ పన్నెండేళ్ల తర్వాత అహ్మదాబాద్‌ క్రైం పోలీసులకు పట్టుబడ్డ.. ఆ అజ్ఞాత నటుడు ఎవరో కాదు హేమంత్ నాగిందాస్ పురుషోత్తమ్‌దాస్ (వైష్ణవ్) అలియాస్ హేమంత్ మోడీ (53). బాలీవుడ్‌తోపాటు పలు గుజరాతీ మువీల్లో నటించిన హేమంత్‌ తన స్థావరాలతోపాటు పేర్లు కూడా మార్చుకొంటూ పలు వెబ్‌ సిరీస్‌లలో, మువీల్లో, సీరియల్స్‌, టీవీ షోలలో నటించాడు. ఇందులో పలు ప్రముఖ సంస్థలు నిర్మించిన చిత్రాలు సైతం ఉన్నట్లు పోలీస్‌ అధికారులు గుర్తించి నోరెళ్లబెట్టారు. గురువారం (మే 21) గుజరాత్‌లోని మెట్రో స్టేషను వద్ద హేమంత్‌ను గుర్తుపట్టిన పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Actor Hemant Modi

ఎవరీ హేమంత్‌..? ఏమిటీ క్రైం స్టోరీ..?

అహ్మదాబాద్‌లోని నరోడా ప్రాంతంలో 2005లో జరిగిన ఘర్షణకు సంబంధించిన హత్య కేసులో హేమంత్ వైష్ణవ్‌కు శిక్ష పడింది. అతడిపై హత్య, అల్లర్ల కేసు నమోదైంది. నగరంలోని పార్శ్వనాథ్‌ టౌన్‌షిప్‌ సమీపంలోని ఇళ్లకు అడ్డుగా, అక్రమంగా నిర్మిస్తున్న మెట్ల గురించి అప్పట్లో వివాదం చెలరేగింది. 2005 జూన్ 15వ తేదీ రాత్రి ఆజాద్ చౌక్ సమీపంలోని పార్శ్వనాథ్ టౌన్‌షిప్ ప్రాంతంలో భూ వివాదంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షనల్లో నరేంద్ర కాంబ్లే అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. 2008 ఆగస్టు 27న ఈ కేసులోని నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న హేమంత్‌కు గుజరాత్‌ హైకోర్టు 2014లో 30 రోజుల పెరోల్‌ మంజూరు చేసింది. 30 రోజుల పెరోల్ గడువు ముగిసిన తర్వాత లొంగిపోకపోవడంతో అతను 2014 నుంచి పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

Bollywood Actor Hemant Modi

నటనావతారం ఎత్తి వరుస మువీల్లో ఆఫర్లు

అరెస్టు నుంచి తప్పించుకునే క్రమంలో హేమంత్ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో పేరు, చిరునామా మార్చుకుని బాలీవుడ్‌లో ప్రముఖ నటులైన అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, అమీర్ ఖాన్‌లతో కలిసి ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, రణ్‌వీర్ సింగ్ ‘జయేష్‌భాయ్ జోర్దార్’, మోహన్‌లాల్ , పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఎల్2 ఎంపురాన్’, ‘వాగ్లే కి దునియా’ వంటి టెలివిజన్ షోలు, థియేటర్ ప్రొడక్షన్‌లతో సహా పలు బాలీవుడ్ వరుస మువీల్లో నటించాడు. త్వరలోనే విడుదయ్యే లాహోర్ 1947, మలయాళ చిత్రం ఎల్2: ఎంపురాన్ వంటి పలు కీలక ప్రాజెక్ట్‌లలోనూ నటిస్తున్నాడు. 12 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న హేమంత్‌ను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.