Reading Time: 2 minutes

అసలు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎలా డిసెడ్ చేస్తారో తెలుసా? పెంచుకోవటం కుదురుతుందా?

Caption of Image.

ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డు ఒక ఆర్థిక ఆయుధంగా మారింది. డెబిట్ కార్డుతో పోలిస్తే రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, EMI ఆఫర్లు ఉండటంతో చాలామంది తమ రోజువారీ అవసరాల కోసం వీటిపైనే ఆధారపడుతున్నారు. క్రెడిట్ కార్డు వాడకం ఒక వరం కావాలన్నా.. శాపం కాకూడదన్నా దాని లిమిట్ వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

క్రెడిట్ లిమిట్ అంటే ఏమిటి? ఎవరు నిర్ణయిస్తారు?
ప్రతి క్రెడిట్ కార్డుకు ఒక స్పెండింగ్ లిమిట్ ఉంటుంది. ఈ పరిమితిని బ్యాంకులు గుడ్డిగా నిర్ణయించవు. మీ నెలవారీ ఆదాయం, మీరు చేసే ఉద్యోగ స్వభావం, జాబ్ స్టెబిలిటీ ఆధారంగా బ్యాంకులు ఈ లిమిట్‌ను ఫిక్స్ చేస్తుంటాయి. మంచి జీతం, స్థిరమైన ఉద్యోగం ఉన్నవారికి బ్యాంకులు ఎక్కువ లిమిట్ ఇచ్చేందుకు ఉత్సాహం చూపుతాయి.

క్రెడిట్ స్కోర్: 
మీకు ఎంత లిమిట్ ఇవ్వాలనేది నిర్ణయించడంలో క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో మీరు తీసుకున్న అప్పులను ఎలా చెల్లించారు? సకాలంలో బిల్లులు కట్టారా? వంటి విషయాలను ఈ స్కోర్ తెలియజేస్తుంది. స్కోర్ బాగుంటే అధిక లిమిట్ లభించడమే కాకుండా.. భవిష్యత్తులో హోమ్ లోన్, కార్ లోన్ తీసుకునేటప్పుడు తక్కువ వడ్డీ రేట్లకే రుణం లభించే అవకాశం ఉంటుంది.

ఖర్చు చేసే తీరుపై ఒక కన్నేయండి..
మీరు కార్డును ఎలా వాడుతున్నారు అనే అంశాన్ని బ్యాంకులు నిశితంగా గమనిస్తుంటాయి. కార్డు లిమిట్ మొత్తం వాడేస్తున్నారా లేదా మితంగా వాడుతున్నారా అనేది మీ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుంది. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించేవారికి బ్యాంకులు తమంతట తామే లిమిట్‌ను పెంచుతుంటాయి. అదే సమయంలో అప్పుడప్పుడు చెల్లింపులు ఆలస్యం చేస్తే.. ఉన్న లిమిట్‌ను కూడా తగ్గించే ప్రమాదం ఉంది.

30 శాతం రూల్..
ఆర్థిక నిపుణులు ఇచ్చే కీలకమైన సలహా ఏమిటంటే.. క్రెడిట్ కార్డు లిమిట్‌లో కేవలం 30 శాతం మాత్రమే వాడాలని. ఉదాహరణకు కార్డు లిమిట్ రూ.లక్ష ఉంటే.. అందులో రూ.30 వేలకు మించకుండా వాడుకోవటం బెటర్. దీనినే ‘క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో’ అంటారు. ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పెరగడమే కాకుండా.. మీరు అప్పులపై ఆధారపడటం లేదనే మంచి సంకేతం బ్యాంకులకు వెళ్తుంది.

క్రెడిట్ కార్డు అనేది బాధ్యతాయుతంగా వాడితే మీ ఆర్థిక స్థాయిని పెంచే నిచ్చెన అవుతుంది. పరిమితికి లోబడి ఖర్చు చేస్తూ, బిల్లులను సకాలంలో చెల్లిస్తేనే ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ బలంగా ఉంటుంది. 

©️ VIL Media Pvt Ltd.