ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి, మెగాస్టార్ చిరంజీవి గారితో తన సినీ ప్రయాణంలోని ప్రత్యేక అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. భరణి చిరంజీవిని “ఎటర్నల్ ఎనర్జీ” అని అభివర్ణిస్తూ, ఆయన పేరులోనే ఒక మ్యాజిక్, ఒక మ్యూజిక్ ఉన్నాయని పేర్కొన్నారు. చిరంజీవి తన పేరు వెనుక ఉన్న కథను భరణికి ఒక షూటింగ్ సందర్భంలో వివరించారట. చిరంజీవి అసలు పేరు శివశంకర ప్రసాద్ అని, ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు పేరు మార్పు గురించి ఆలోచిస్తున్న తరుణంలో ఒక కల వచ్చిందని ఆయన చెప్పారట.
ఆ కలలో ఎవరో తనను “చిరంజీవి” అని పిలిచినట్టుగా అనిపించిందని, తాను ఆంజనేయస్వామి భక్తుడిని కాబట్టి, చిరంజీవుల జాబితాలో ఆంజనేయస్వామి కూడా ఉంటారని, ఈ పేరు బాగుందని తన తల్లికి చెప్పగా ఆమె కూడా సమ్మతించారని భరణి గుర్తుచేసుకున్నారు. చిరంజీవి అంటే శాశ్వతత్వం అని, అందుకే ఆ పేరు పట్ల తనకు ఎంతో ఇష్టమని చిరంజీవి చెప్పినట్టు భరణి తెలిపారు. చిరంజీవితో తనికెళ్ళ భరణికి మొదటిసారిగా తెరను పంచుకున్న అనుభవం జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలో. ఈ చిత్రంలోని ఒక ఫైట్ సీన్లో చిరంజీవిని హాకీ స్టిక్‌తో కొట్టాల్సిన సన్నివేశం ఉందని భరణి వివరించారు.
రిహార్సల్ సమయంలో డమ్మీ హాకీ స్టిక్ విరిగిపోవడంతో, టేక్ సమయంలో చిత్ర బృందం అసలైన హాకీ స్టిక్‌ను ఇచ్చిందని భరణి ఆసక్తికరంగా చెప్పారు. ఆ సమయంలో తనకు ఎంతో టెన్షన్ కలిగిందని, ఒక చిన్న పొరపాటు జరిగినా చిరంజీవికి దెబ్బ తగిలి, షెడ్యూల్ మొత్తం దెబ్బతింటుందని ఆందోళన చెందానని ఆయన అన్నారు. అయితే, చిరంజీవి తన అద్భుతమైన టైమింగ్‌తో, తల వంచి, దెబ్బ తగలకుండా తప్పించుకున్నారని భరణి వివరించారు. ఈ సంఘటన చిరంజీవికి నటనలోని సాంకేతిక అంశాలపై ఉన్న అవగాహనను, గొప్పతనాని స్పష్టం చేసిందని భరణి కొనియాడారు.
ఆంధ్రదేశంలో భారీ తుఫానులు, వరదలు ఉన్నప్పటికీ ఈ చిత్రం అద్భుత విజయం సాధించిందని, హైదరాబాద్‌లో ఘనంగా 100 రోజుల వేడుకను నిర్వహించారని ఆయన గుర్తుచేసుకున్నారు.తర్వాత, బిగ్ బాస్ చిత్రంలో చిరంజీవి దర్శకత్వంలో తాను నటించిన అనుభవాన్ని భరణి పంచుకున్నారు. ఈ చిత్రంలో భరణి ఒక క్రూరమైన ఎస్సై పాత్ర (యాదగిరి) పోషించారు. ఒక కీలక సన్నివేశంలో చిరంజీవి అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు, ఆయనను రెచ్చగొట్టడానికి భరణి పాత్ర ఒక మేకపిల్లను కొట్టడం, కుంటి తమ్ముడిని తన్నడం, తల్లిని తోసేయడం వంటివి చేస్తుంది. ఈ సన్నివేశం చిత్రీకరణ జరుగుతున్న సమయంలో నిర్మాత బాపినీడు గారికి దగ్గరైన ఒక మ స్నేహితుడికి గుండె సమస్య రావడంతో, చిరంజీవి డేట్స్ విషయంలో సమస్య తలెత్తింది.
షూటింగ్‌ను ఆపలేని పరిస్థితిలో, చిరంజీవి స్వయంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి, మూడు రోజుల పాటు ఫైట్ సీక్వెన్స్‌ను రూపొందించారు. భరణిని చితకబాదే ఈ సన్నివేశం ఒక హాలీవుడ్ చిత్ర స్థాయిలో ఉందని, సాంకేతిక పరిజ్ఞానంతో చిరంజీవి దీన్ని అద్భుతంగా చిత్రీకరించారని భరణి ప్రశంసించారు. ఆర్టిస్టులు కేవలం వచ్చి వేషం వేసి వెళ్లిపోతారని, కానీ నిరంతరం ప్రతీ షాట్‌ను, యాంగిల్స్‌ను గమనించినవారు మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలరని భరణి అన్నారు. ఈ అనుభవాల ద్వారా, చిరంజీవి అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, గొప్ప దర్శకుడు కూడా అని తనికెళ్ళ భరణి పేర్కొన్నారు.




