Reading Time: 2 minutes
Telangana: సమస్యలు పరిష్కరిస్తాం.. సమ్మె విరమించండి- మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ అనేది రాష్ట్రంలోని పేద ప్రజలకు లైఫ్‌ లైన్.. రాష్ట్రవ్యాప్తంగా రోజుకూ 65 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.. అందులో 40లక్షల మంది మహిళలు ఉద్యోగ రీత్యా, విద్యా, వైద్య అవసరాలకు ప్రయాణం చేస్తున్నారు. ఇవన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు దృశ్య ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని.. మిగిలిన మూడు అంశాలపై చర్చిస్తున్నామన్నారు.

ఈ సమస్యపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసినప్పటికీ అధికారుల కమిటీతో ఐదు గంటలపైగా చర్చిస్తుండగానే సమ్మెకు పోతున్నామని మద్యలో వెళ్లిపోవడం కుట్రలా ఉందన్నారు మంత్రి పొన్నం. ఇటీవల జగిత్యాల సభలో మహాలక్ష్మీ ప్రయాణంపై కేసీఆర్ అవహేళనగా మాట్లాడారని.. వెంటనే ఆర్టీసీపై కుట్రలో భాగంగానే గతంలో యూనియన్ అధ్యక్షుడుగా ఉన్న హరీష్ రావు సమ్మె విషయంలో కార్మికులను ప్రోత్సహించారని ఆరోపించారు. మహాలక్ష్మీ పథకాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఈ కుట్ర చేస్తున్నారన్నారు.

డిప్యూటీ సీఎం రాష్ట్రంలో లేరు ఆర్టీసీ డిమాండ్స్ పై చర్చిస్తున్నామని అధికారులు చెప్పినప్పటికీ వినకుండా ఎవరితో ఫోన్‌లో మాట్లాడి సమ్మెకి వెళ్ళారన్నారు. ఆర్టీసీ కార్మికులకు 2013 బాండ్స్ కింద రూ. 280 కోట్లు ఇచ్చామని..1134 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర రవాణా శాఖ పక్షాన పని భారం లేకుండా కార్మిక చట్టాలు చేశామన్నారు. గతంలో 12 గంటలు వాహనం నడపడం వల్ల మరునాడు హాఫ్ ఉండేది.. వాళ్ళు ఎలా అంటే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తాము శ్రమ దోపిడి చేయట్లేదని.. పనిభారం లేకుండా చేయాలని చూస్తున్నామన్నారు.

విలీనం,యూనియన్ ల అంశాలు ప్రభుత్వం పరిగణనలో ఉన్నాయని.. ప్రభుత్వం నెలకి ఆర్టీసీకి రూ. 300 కోట్ల ,అవసరమైనప్పుడు రూ. 400 కోట్లు ఇస్తుందన్నారు. ఆర్టీసీ లో సర్వీసు నుండి రిటైర్ అయిన వారికి 250 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తున్నామని పేద ప్రజల లైఫ్ లైన్ అయిన ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలు చేయద్దన్నారు. పేద ప్రజల రవాణా వ్యవస్థ బాగుండాలి, పని చేస్తున్న 40 వేల కుటుంబాల ఉద్యోగుల బాగుండాలన్నారు. డిప్యూటీ సీఎం చెన్నైలో ఉండడం వల్ల మాట్లాడలేకపోయాం.. డిపో వారిగా సమీక్ష చేసి పని ఒత్తిడి ఉన్న దగ్గర తగ్గిస్తాం అన్నారు.

29 అంశాలపై వెంటనే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని.. ఆర్థిక పరమైన అంశాలను కూడా ప్రభుత్వం భారం మోయడానికి సిద్ధంగా ఉందన్నారు. విలీనం ,సంఘాల ఏర్పాటు, పీఆర్సీ కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. మూడు సాంకేతిక అంశాలపై కమిటి రిపోర్ట్ అందిస్తుందని కార్మికులు బేషరతుగా సమ్మె విరమించాలన్నారు. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని.. కార్మికులు సమ్మె విరమించాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.