
హైదరాబాద్ నగరంలో మత్తు పదార్థాల విక్రయాలు మరోసారి కలకలం రేపాయి. విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో డ్రగ్స్ దిగుమతి చేసుకుని, ఇక్కడ విక్రయిస్తున్న ముఠా గుట్టును ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. బ్యాంకాక్ నుంచి స్మగ్లింగ్ చేసిన ఖరీదైన హైబ్రిడ్ గంజాయి ‘ఓజీ కుష్’ను ముషీరాబాద్ పరిధిలో పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ముషీరాబాద్ ప్రాంతంలోని నామాలగుండు వద్ద మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. సీఐ రామకృష్ణ, ఎస్సై శ్రావణ్ నేతృత్వంలోని బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 29 ఏళ్ల రాహుల్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు, అతని వద్ద నుంచి 1.311 కిలోల అత్యంత ఖరీదైన ‘ఓజీ కుష్’ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.36 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నిందితుడు రాహుల్ సింగ్‌ను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంజాత్ సింగ్ అనే వ్యక్తి ఈ హైబ్రిడ్ గంజాయిని బ్యాంకాక్ నుంచి అక్రమంగా తెప్పించి రాహుల్‌కు అప్పగిస్తాడని తెలిసింది. ప్రస్తుతం ఇంజాత్ సింగ్ ఇతర కేసుల్లో జైలులో ఉండగా, అతని ఆదేశాల మేరకు రాహుల్ నగరంలో ఈ మత్తు పదార్థాలను విక్రయిస్తున్నాడు. సామాన్యులకు అందని ధరలో ఉండే ఈ రకం గంజాయిని సంపన్న వర్గాలను లక్ష్యంగా చేసుకుని అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసుల కళ్లు గప్పి విదేశాల నుంచి ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ ఎలా వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. యువత ఇలాంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే చాలు ఇంటికి తిరిగొస్తాయ్..