Reading Time: < 1 minute
Ktr Reacts High Court Stay On Pc Ghosh Commission Report Congress Conspiracy Slap

KTR: హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టేను స్వాగతిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షసాధింపునకు వ్యవస్థల దుర్వినియోగాన్ని తీర్పు ఎండగట్టిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టత ఇచ్చిందని గుర్తు చేశారు. “పీసీ ఘోష్ కాదు, ఇది పీసీసీ నివేదిక” అన్న బీఆర్ఎస్ వాదన నిజమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సహజ న్యాయ సూత్రాలు, నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. కేసీఆర్ ముందే చెప్పిన అంశాలను హైకోర్టు సమర్థించిందని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న పిల్లర్లను వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు. సాగునీటి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు. గోదావరి జలాల వినియోగంపై ప్రభుత్వం వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలను ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

READ MORE: Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

మరోవైపు.. ఈ అంశంపై ఇప్పటికే మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. “ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది. ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఔనన్నా కాదన్నా.. ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం..” అని పేర్కొన్నారు.