Reading Time: < 1 minute
Ipl 2026 Punjab Kings Undefeated Streak Cooper Connolly Injury Update Australia

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ప్రస్తుతం తిరుగులేని ఫామ్‌లో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అభిమానులను అలరిస్తోంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు నమోదు చేయగా, ఒక మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ ప్లేఆఫ్స్ దిశగా దూసుకుపోతున్న పంజాబ్ జట్టుకు ఇప్పుడు ఒక ఎదురుదెబ్బ తగిలింది.

ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున బ్యాటింగ్‌లో చెలరేగిపోతున్న ఆస్ట్రేలియా యువ సంచలనం కూపర్ కొన్నోలీ జట్టును వీడి అర్ధాంతరంగా ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. వెన్ను గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న అతనికి, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక సూచనలు చేసింది. ఏప్రిల్ నెలాఖరు వరకు అతడిని కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడాలని, బౌలింగ్ చేయవద్దని స్పష్టం చేసింది. అయితే.. తాజాగా తన బౌలింగ్ ఫిట్‌నెస్‌ను పరీక్షించుకోవడానికి, పూర్తిస్థాయి వైద్య పరీక్షల కోసం అతను ఆస్ట్రేలియా వెళ్ళినట్లు సమాచారం.

ఈ సీజన్‌లో కొన్నోలీ పంజాబ్ జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌పై 72 పరుగులు, లక్నో సూపర్ జెయింట్స్‌పై 87 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే ముఖ్యమైన మ్యాచ్‌కు కేవలం మూడు రోజుల ముందు అతను జట్టుకు దూరం కావడం పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌ను కొంత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే అతను కేవలం ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసమే వెళ్ళాడని.. త్వరలోనే తిరిగి జట్టుతో చేరుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.