Reading Time: < 1 minute
Condom Prices Hike 30 Percent Usa Iran Tension Karex Supply Crisis

Condom Prices: అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా వినియోగ వస్తువుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉధృతి కారణంగా, ప్రపంచవ్యాప్తంగా కండోమ్ ధరలు 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరగనున్నాయి. అమెరికా – ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టనున్నాయి. యుద్ధ భయాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ సంస్థ ‘కారెక్స్’ (Karex) ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రభావం కేవలం ఒక వస్తువుకే పరిమితం కాకుండా, విమాన ప్రయాణాలు, నిత్యావసరాలపై కూడా పడనుంది.

ధరల పెరుగుదలకు కారణాలేంటంటే..
కారెక్స్ సీఈఓ గో మియా కియాట్ (Goh Miah Kiat) వెల్లడించిన వివరాల ప్రకారం.. కండోమ్ తయారీకి అవసరమైన అమ్మోనియా, సిలికాన్ ఆధారిత లూబ్రికెంట్లు వంటి పెట్రోకెమికల్ ఉత్పత్తుల సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ గ్యాస్‌లో ఐదో వంతు హోర్ముజ్ జలసంధి గుండానే వెళ్తుంది. అక్కడ సైనిక ఆంక్షలు, నాకేబందీ కారణంగా రవాణా వ్యయం భారీగా పెరిగింది. విచిత్రంగా యుద్ధం లేదా ఆర్థిక అనిశ్చితి ఉన్న సమయంలో కండోమ్స్‌కు డిమాండ్ 30% పెరిగింది. ఉద్యోగ భద్రత లేనప్పుడు ప్రజలు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారని, అందుకే డిమాండ్ పెరిగిందని సంస్థ తెలిపింది. కారెక్స్ సంస్థ ఏటా 500 కోట్లకు పైగా కండోమ్స్‌ను తయారు చేస్తూ డ్యూరెక్స్ (Durex), ట్రోజన్ (Trojan) వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు సరఫరా చేస్తోంది.

ఇతర రంగాలపై ప్రభావం..
హోర్ముజ్ ఉద్రిక్తతల వల్ల కేవలం కండోమ్స్‌ మాత్రమే కాదు, మరికొన్ని రంగాలు కూడా దెబ్బతిన్నాయి. అవి ఏంటంటే.. గత ఏడాదితో పోలిస్తే ఎకానమీ క్లాస్ విమాన టికెట్ల ధరలు సగటున 24% పెరిగాయి. ఇదే సమయంలో రవాణా ఖర్చులు పెరగడంతో చక్కెర, డెయిరీ ఉత్పత్తులు, పండ్ల ధరలు కూడా పెరగనున్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. హీలియం గ్యాస్ కొరత కారణంగా కంప్యూటర్ చిప్స్ తయారీ మందగించి, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల ఆర్థిక పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.