దక్షిణ భారతీయులకి బ్రేక్ ఫాస్ట్ అంటే రోజూ ఇడ్లీ, దోశ ఉండాల్సిందే. ఇవి తినడానికి అద్భుతంగా ఉంటాయి. ఇందులో దోసకు ప్రత్యేక స్థానం ఉంది. కానీ, ఈ దోశ, ఇడ్లీ పిండి తయారు చేయడమే చాలా పెద్ద పని. అందుకోసమే, సమయం ఆదా చేసుకోవడానికి చాలా మంది వారానికి సరిపడా పిండిని ఒకేసారి రుబ్బి నిల్వ చేసుకుంటారు. కానీ, ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని మీకు తెలుసా? దోస పిండిని 3 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంచడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.ఆ వివరాల్లేంటో ఇక్కడ చూద్దాం..
దోస పిండిని బియ్యం, మినప్పప్పుతో తయారు చేస్తారు. దీనిని పులియబెట్టడం వల్ల ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) పెరుగుతాయి. అయితే, ఫ్రిజ్లో ఉంచినప్పటికీ ఈ పులియబెట్టే ప్రక్రియ ఆగిపోదు, కేవలం నెమ్మదిస్తుంది. 3 రోజుల తర్వాత పిండిలో ఉండే కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమై, ఆల్కహాల్ వంటి పదార్థాలు, హానికరమైన ఈస్ట్ పెరుగుతాయి.
పిండి ఎక్కువ కాలం నిల్వ ఉంటే అందులో ఆమ్లత్వం (Acidity) పెరుగుతుంది. దీనివల్ల దోసలు తిన్న తర్వాత కడుపులో మంట లేదా గుండెల్లో మంట కలగవచ్చు. నిల్వ ఉన్న పిండిలో సాల్మొనెల్లా (Salmonella) వంటి బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. దీనివల్ల వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి వంటి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులకు ఇలాంటి నిల్వ పిండితో చేసిన దోసలు వేయకపోవడమే మంచిది.
అందుకే పిండిని పరిమితంగా రుబ్బుకోవాలి. కేవలం 2 లేదా 3 రోజులకు సరిపడా పిండిని మాత్రమే రుబ్బడం ఉత్తమం. పిండిని నిల్వ చేయడానికి ప్లాస్టిక్ డబ్బాల కంటే స్టీల్ లేదా గాజు పాత్రలను వాడటం సురక్షితం. పిండిని ఫ్రిజ్లో పెట్టే ముందు ఉప్పు కలపకుండా ఉంటే అది త్వరగా పులియకుండా ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే ఉప్పు కలుపుకోవాలి.
ముఖ్యంగా పిండి నుండి పుల్లటి వాసన రావడం లేదా రంగు మారడం వంటివి జరిగితే, దానిని వెంటనే పారవేయడం ఉత్తమం. తాజాగా రుబ్బిన పిండితో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల పూర్తిస్థాయి పోషకాలు అందుతాయి. రుచి కంటే ఆరోగ్యమే ముఖ్యం. కాబట్టి వీలైనంత వరకు తాజాగా తయారు చేసిన పిండిని వాడటానికి ప్రయత్నించండి. పిండిలో ఏదైనా తేడా కనిపిస్తే రిస్క్ తీసుకోకుండా దానిని వాడకపోవడమే శ్రేయస్కరం.




