Reading Time: 2 minutes
Mi Vs Csk Ipl 2026 Ms Dhoni Deepak Chahar Viral Video Wankhede Match

ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎంత క్రేజీగా ఉంటుందో.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య పోరు అంత ఆసక్తికరంగా ఉంటుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై, ధోనీ కెప్టెన్సీలో చెన్నై చెరో 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచాయి. ఇప్పుడు ఐపీఎల్ 2026లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఏప్రిల్ 23, గురువారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఒక సరదా వీడియోను షేర్ చేసింది. ఇందులో దీపక్ చాహర్ తన పాత గురువు ఎంఎస్ ధోనీని కలవడానికి వెళ్లారు. చాహర్ వెనకాలే కెమెరామెన్ రావడం చూసి ధోనీ స్పందిస్తూ.. “నువ్వు వస్తూ వస్తూ నీతో పాటు కెమెరాను కూడా తీసుకొచ్చావు” అని సరదాగా అన్నారు. దానికి చాహర్ కూడా కెమెరామెన్‌తో.. “భయ్యా వెళ్ళిపోండి, మేము మాట్లాడుకోలేము” అని నవ్వుతూ చెప్పారు. ఆ తర్వాత చాహర్ ధోనీ పాదాలకు నమస్కరించి తన గౌరవాన్ని చాటుకున్నారు.

గురువుకు ఎదురుగా శిష్యుడు..

దీపక్ చాహర్ ఐపీఎల్ కెరీర్ ధోనీ నాయకత్వంలోనే మొదలైంది. 2016లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరపున ధోనీ కెప్టెన్సీలో ఆయన అరంగేట్రం చేశారు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక బౌలర్‌గా ఎదిగారు. అయితే.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ చాహర్‌ను రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసింది.

ధోనీ రీ-ఎంట్రీ..?

ఈ మ్యాచ్‌లో అందరి కళ్ళు ధోనీపైనే ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ధోనీ ఫిట్‌నెస్ సమస్యల వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ.. ముంబైతో జరిగే ఈ పెద్ద మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకప్పుడు ధోనీ శిష్యుడిగా ఉన్న చాహర్, ఇప్పుడు ముంబై తరపున ధోనీ జట్టుపై ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి.