Reading Time: < 1 minute
AP Weather: ఆడ ఎండలు, ఈడ వానలు.. ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణంలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. మరాఠ్వాడ నుంచి కొమొరిన్ ప్రాంతం వరకు అంతర కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలుల అంతరాయం (ద్రోణి) విస్తరించి ఉంది. ఇదే సమయంలో ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాలపై 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, గాలులు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం: బుధ, గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇదే సమయంలో వేడి, తేమ అధికంగా ఉండటంతో ఉక్కపోత పరిస్థితులు కొనసాగే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఇక్కడ కూడా మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే సూచనలు ఉన్నాయి. అయితే వర్షాలు పడినా ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోవడంతో వేడి, తేమ కారణంగా అసౌకర్య వాతావరణం నెలకొనే అవకాశముంది.

రాయలసీమ: బుధ, గురు వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు కనిపించే అవకాశం ఉంది. శుక్రవారం కూడా స్వల్ప వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అయితే వర్షాలున్నా ఎండ తీవ్రత తగ్గే సూచనలు పెద్దగా కనిపించడం లేదు.

కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని అధికారులు తెలిపారు. కానీ రాయలసీమలో మాత్రం ఎండలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. అక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే సూచనలు ఉన్నాయి.

మొత్తానికి.. ఒకవైపు ఉరుములతో కూడిన జల్లులు, మరోవైపు మండే ఎండలు.. ఇలా రెండు విభిన్న వాతావరణ పరిస్థితులు రాష్ట్రంలో ఒకేసారి కనిపించనున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Also Read: అప్పు వెంటనే కట్టాలని వేధిస్తున్నారా..? ఈ ఒక్కటి చేస్తే మీ జోలికి అస్సలు రారు..