Reading Time: < 1 minute

భర్త తన మాట వినలేదని.. ముగ్గురు పిల్లలతో బావిలో దూకిన భార్య

Caption of Image.

బెదిరించాలనుకుందో లేక గొడవ పెద్దగయ్యి మనస్థాపం చెందిందో కానీ.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బోర్ వేయొద్దంటే భర్త వినలేదని భార్య, తన ముగ్గురు పిల్లలతో బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ప్రమాదంలో కుమారుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. గురువారం (మార్చి 12) జరిగిన ఈ ఘటన  మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం  భూత్పూర్ మండలం వెల్కిచర్లలో భార్యభర్తల మధ్య గొడవ ప్రాణం మీదకు వచ్చింది. భర్త భీరయ్య తనకున్న 2 ఎకరాల వ్యవసాయ పొలంలో బోరు వేయగా నీళ్లు పడలేదు. ఇవాళ మరొక చోట బోరు వేస్తుండగా జంగమ్మ వద్దు అని చెప్పినా  భర్త వినలేదు. దీంతో మనస్థాపం చెంది ముగ్గురు పిల్లలతో సహ ఆత్మహత్య చేసుకునేందుకు బావిలో దూకింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు ఆడ‌పిల్లల‌తో స‌హా త‌ల్లి మృతి చెందగా.. కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. బావిలో దూకిన వారిని కాపాడేందుకు భర్త, గ్రామస్తులు చేసిన ప్రయత్నం విఫలమైంది. కుమారుడు మాత్రమే బయటపడ్డాడు. 

వెల్కిచర్లలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటన గురించి తెలిసిన గ్రామస్తులు బావి దగ్గరకు వెళ్లి కన్నీరు పెట్టుకున్నారు. బోరు వేస్తే అప్పుల పాలవుతామని భార్య వాదించగా.. ఈ ఒక్క ప్రయత్నం చేద్దాం.. బోరు పడితే కష్టాలు తీరుతాయని భర్త. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీయగా.. బోరు వేసేందుకు భర్త నిర్ణయించుకోవడంతో భార్య మనస్థాపానికి గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో పిల్లలతో పాటు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.