Reading Time: < 1 minute
Ap Gram Panchayats Restructuring Government Introduces New Rurban Panchayats

AP Government Introduces New Rurban Panchayats: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. గ్రామ పంచాయతీల పునర్ వ్యవస్థీకరణకు చర్యలు ప్రారంభించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సరికొత్త సంస్కరణలను తీసుకువస్తూ.. గ్రామ పంచాయతీలను జనాభా, ఆదాయం ఆధారంగా కొత్తగా వర్గీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ మార్పులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల తరహా సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జనాభా 10 వేల కంటే ఎక్కువగా ఉండే గ్రామ పంచాయతీలు లేదా గ్రామ వార్షిక ఆదాయం రూ.1 కోటి కంటే ఎక్కువగా ఉండే పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా గుర్తించనున్నారు. అదేవిధంగా జనాభా 3 వేల నుంచి 10 వేల మధ్య ఉండే గ్రామాలను గ్రేడ్-1 పంచాయతీలుగా గుర్తించనున్నారు. గ్రామ వార్షిక ఆదాయం రూ.30 లక్షల కంటే ఎక్కువగా ఉండి.. రూ.1 కోటి లోపు ఉంటే కూడా ఆ పంచాయతీలను గ్రేడ్-1గా వర్గీకరించనున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.

Also Read: Hardik Pandya Stats: బిగ్ మ్యాచ్‌లలో బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్.. ఐసీసీ నాకౌట్‌లలో ఆహా అనిపిస్తున్న హార్దిక్ గణాంకాలు!

ఇక జనాభా 2 వేల కంటే తక్కువగా ఉండే గ్రామ పంచాయతీలను గ్రేడ్-2 పంచాయతీలుగా నిర్ణయించారు. జనాభా 1500 కంటే తక్కువగా ఉన్న పంచాయతీలను గ్రేడ్-3 పంచాయతీలుగా వర్గీకరించనున్నారు. ఈ కొత్త విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ పునర్ వ్యవస్థీకరణతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు గ్రామాల అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. రూర్బన్ పంచాయతీల ద్వారా గ్రామాల్లోనూ పట్టణాల తరహా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.