Reading Time: 2 minutes
Jasprit Bumrahs Game Changing Spell Took India To T20 World Cup 2026 Final

Jasprit Bumrah’s That 3 Overs Are Incredible: టీ20 ప్రపంచ కప్‌ 2026ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం అటు ప్లేయర్స్, ఇటు ఫాన్స్ ప్రపంచ కప్‌ విజయంను ఎంజాయ్ చేస్తున్నారు. భారత్ ట్రోఫీ గెలవడంతో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పాత్ర ఎంతో కీలకం. పిసినారి బౌలింగ్‌తో టీమిండియాకు ఊహించని విజయాలు అందించాడు.

అది ఇంగ్లాండ్‌తో భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్.. వాంఖడే స్టేడియంలో ఉత్కంఠ భరిత వాతావరణం.. వేలాది మంది ప్రేక్షకులు స్టేడియంలో కూర్చుని మ్యాచ్‌ను ఆసక్తిగా చూస్తునారు.. కోట్లాది అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. భారత్ 254 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ.. మ్యాచ్ చేజారిపోతుందేమో అన్న ఆందోళన అందరిలో కనిపించింది. కారణం ఇంగ్లాండ్ బ్యాటర్ బెతెల్‌ విధ్వంసకరమైన బ్యాటింగ్‌ చేస్తుండటమే. 15 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోరు 185/5గా ఉంది. అప్పటికే బెతెల్‌ 36 బంతుల్లోనే 81 పరుగులు చేసి దూకుడుమీదున్నాడు. బెతెల్‌ బ్యాటింగ్ చూస్తుంటే.. చివరి 5 ఓవర్లలో 69 పరుగులు చేయడం పెద్ద విషయం కాదనిపించింది.

ఆ సమయంలో భారత జట్టు బ్రహ్మాస్త్రంలా జస్ప్రీత్ బుమ్రా రంగంలోకి దిగాడు. స్లో బంతులు, యార్కర్లు అద్భుతంగా మేళవిస్తూ బ్యాటర్లకు కళ్లెం వేశాడు. 16వ ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా.. 18వ ఓవర్లో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 6 పరుగులే ఇచ్చాడు. ఆ రెండు ఓవర్లే మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాయి. 12.5 రన్‌రేట్‌తో సాగుతున్న మ్యాచ్‌లో బుమ్రా ఎకానమీ 8.5 మాత్రమే ఉండటం అతడి అద్భుత బౌలింగ్‌కు నిదర్శనం. బుమ్రా బౌలింగ్‌లోని తీవ్రత, ఏకాగ్రత బ్యాటర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. ఒత్తిడి ఎక్కువైతే అతడు మరింత పదునుగా మారుతాడని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది.

Also Read: SAP Chairman-Bollineni Chandrika: అనారోగ్యంతో బాధపడుతున్న క్రీడాకారిణి చంద్రిక.. శాప్ చైర్మన్ ఆర్థిక సహాయం!

వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 పోరులో కరేబియన్ జట్టు 102/1తో దుమ్మురేపుతోంది. ఆ సమయంలో జస్ప్రీత్ బుమ్రా బంతి అందుకున్నాడు. ప్రమాదకర షిమ్రన్ హెట్‌మయర్, రోస్టన్ చేజ్‌లను ఒకే ఓవర్లో ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఆ వికెట్లు మ్యాచ్‌లో కీలక మలుపుగా మారాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో కూడా బుమ్రా నాలుగు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. గ్రూప్ దశలో పాకిస్థాన్‌పై రెండో ఓవర్లోనే రెండు వికెట్లు తీసి ఆ జట్టు పతనానికి నాంది పలికాడు. నమీబియా, జింబాబ్వే జట్లపై కూడా బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఫైనల్లో కూడా అంచనాలకు తగ్గట్టే రాణించాడు.

టీ20 ప్రపంచ కప్‌ 2026లో సిక్స్‌లు, ఫోర్ల వర్షం కురిసినప్పటికీ.. జస్ప్రీత్ బుమ్రా ఎకానమీ రేటు కేవలం 6.21 మాత్రమే ఉండటం విశేషం. బుమ్రా ఓవర్లు మిగిలి ఉంటే.. మ్యాచ్ భారత్ చేతుల్లోనే ఉందని అభిమానుల్లో ఓ నమ్మకం ఏర్పడింది. అందుకు ఉదాహరణలే ఇంగ్లాండ్‌పై రెండు ఓవర్లు, వెస్టిండీస్‌పై ఓ ఓవర్. టోర్నీ మొత్తం భారత బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించిన బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘పిసినారి బుమ్రా’ అని ఫాన్స్ ముద్దుగా పిలుచుకుంటున్నారు.