Reading Time: 2 minutes

రాష్ట్రపతి ఫోటోపై మోదీ vs మమతా : ఆ ఫోటో వెనుక అసలు నిజం ఇదీ…

Caption of Image.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి, సీఎం మమతా బెనర్జీకి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒక ఫోటోను చూపిస్తూ మమతా బెనర్జీ చేసిన విమర్శలకు బీజేపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఒక బహిరంగ సభలో మమతా బెనర్జీ ఒక ఫోటోను చూపించారు. అందులో రాష్ట్రపతి ముర్ము నిలబడి ఉండగా, ప్రధాని మోదీ కుర్చీలో కూర్చుని ఉన్నారు.

“దేశ రాష్ట్రపతి, ఒక గిరిజన మహిళా నాయకురాలు నిలబడి ఉంటే.. ప్రధాని మాత్రం హాయిగా కూర్చున్నారు. ఇది ఆమెను అగౌరవపరచడం కాదా?” అని మమత ప్రశ్నించారు. దీనిని తృణమూల్ కాంగ్రెస్ (TMC) సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బీజేపీకి గిరిజనులపై గౌరవం లేదని విమర్శించింది.

బిజెపి Fact Check:
మమత చూపిస్తున్నది ‘నకిలీ వార్త’ అని బీజేపీ కొట్టిపారేసింది. ఆ ఫోటో వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టింది. ఆ ఫోటో 2024 మార్చి 31న తీసినది. బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీకి ఆయన నివాసంలో ‘భారతరత్న’ అవార్డును రాష్ట్రపతి స్వయంగా అందజేశారు. అద్వానీ గారి వయసు, ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్రపతి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు ఇచ్చారు. అవార్డు ప్రదానం చేసే సమయంలో రాష్ట్రపతి నిలబడటం, మిగిలిన వారు ప్రధానితో సహా కూర్చుని ఉండటం అనేది అధికారిక ప్రోటోకాల్. ఇందులో ఎలాంటి అగౌరవం లేదని బీజేపీ స్పష్టం చేసింది.

రాష్ట్రపతి పర్యటనలో ఏం జరిగింది :
డార్జిలింగ్‌లో జరిగిన ఒక గిరిజన సదస్సుకు రాష్ట్రపతి ముర్ము హాజరయ్యారు. అక్కడ ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ స్వాగతం పలకడానికి రాకపోవడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్యక్రమ ఏర్పాట్లు సరిగా లేవని, కనీసం వాష్‌రూమ్‌లో నీళ్లు కూడా లేవని కేంద్ర హోం శాఖ గుర్తించింది. రాష్ట్రపతి వెళ్లే దారి అంతా చెత్తతో నిండి ఉందని కేంద్రం సీరియస్ అయ్యింది.

మమతా బెనర్జీ వివరణ: 
ఈ విమర్శలపై మమత స్పందిస్తూ.. ఆ కార్యక్రమాన్ని ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిందని, దానికి కావాల్సిన ఏర్పాట్లు లేవని తాము ముందే రాష్ట్రపతి కార్యాలయానికి చెప్పామని అన్నారు. తన పేరు ప్రోటోకాల్ లిస్టులో లేదని, అందుకే తాను వెళ్లలేదని ఆమె చెప్పుకొచ్చారు. రాష్ట్రపతికి జరిగిన ఈ అవమానంపై కేంద్ర హోం కార్యదర్శి బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించారు. 

©️ VIL Media Pvt Ltd.