
సిద్దిపేట: తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట కీలక పాత్ర పోషించిందని హరీశ్ రావు అన్నారు. రానున్న రోజుల్లో మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడేందుకు సిద్దిపేట ఉద్యమాల గడ్డ నుంచే నాంది కావాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధి, రైతుల సంక్షేమం, విద్యుత్ సరఫరా, సాగునీటి సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, వెంకట్రామిరెడ్డి, యాదవ రెడ్డి, ఫరూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ బాబు తదితర నాయకులు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రాజెక్టుల ద్వారా సిద్దిపేట జిల్లా సస్యశ్యామలంగా మారిందని హరీశ్ రావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కోతలు తగ్గించాలని ప్రజలు కోరేవారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్ సరఫరా సమస్యలు తీవ్రంగా ఉన్నాయని విమర్శించారు. విద్యుత్ అంతరాయాలతో రైతులు, జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
సిద్దిపేట జిల్లా పదేళ్ల పండుగ ప్రజలందరిదని అన్నారు.
గతంలో రైతులకు ట్రాన్స్‌ఫార్మర్ కావాలన్నా, ఉద్యోగులకు ఏదైనా పని ఉన్నా సంగారెడ్డికి వెళ్లాల్సి వచ్చేదని గుర్తుచేశారు. జిల్లా ఏర్పాటుతో పాటు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల సిద్దిపేట ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.దేశవ్యాప్తంగా సిద్దిపేట జిల్లాకు అనేక అవార్డులు వచ్చాయని, గతంలో ఎన్నికల ప్రచారంలో గోదావరి జలాలు, రైల్వే లైన్, జిల్లా ఏర్పాటు వంటి హామీలు ఇచ్చినప్పటికీ వాటిని నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటుతో మెడికల్ కాలేజీ, కలెక్టరేట్ వంటి కీలక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో పంటలు వేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. ఎల్‌నినో ప్రభావం పేరుతో తప్పించుకోకుండా రైతులకు సాగునీరు, విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నీటి నిర్వహణలో విఫలమవడం వల్లే కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపించారు.
చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించుకుపోతున్నారని, శ్రీశైలం ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. సాగునీరు అందించడంలో విఫలమైనందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేటకు నిధులు కేటాయించాలని అధికారులు కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకుండా పక్కనపెట్టాలని సూచిస్తున్నారని అన్నారు.కేసీఆర్ హయాంలో అన్ని పార్టీల నాయకులను సమానంగా చూశారని, ఎవరిపైనా వివక్ష చూపలేదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటకు రెండుసార్లు వచ్చినప్పుడు కొమురవెల్లి మల్లన్న స్వామి మీద ఒట్టు వేసి రుణమాఫీ చేస్తానని చెప్పారని హరీశ్ రావు అన్నారు. అయినప్పటికీ 24 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపించారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి హామీలు నెరవేర్చకపోవడంతోనే తాను రేవంత్ రెడ్డిని ‘ఎగవేతల రేవంత్’ అని విమర్శిస్తున్నట్లు తెలిపారు.సిద్దిపేట, నర్మేట పర్యటనల్లో 45 రోజుల్లో యాసంగి పంటకు రైతుబంధు ఇస్తానని చెప్పి అమలు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ రైతుల కష్టాలు తెలుసుకుని రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరణించిన రైతుల కుటుంబాలకు రైతుబీమా అందలేదని విమర్శించారు.
తాను ఈ స్థాయికి రావడానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, కేసీఆర్ అందించిన ప్రోత్సాహమే కారణమని హరీశ్ రావు అన్నారు. ఈ సభకు ప్రజలను తరలించేందుకు తాను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని, ఎవరికీ ఫోన్ చేయలేదని, కేవలం ఒక పిలుపు మాత్రమే ఇచ్చానని పేర్కొన్నారు. ఆ పిలుపుతో వేలాదిగా ప్రజలు తరలిరావడం తనపై వారికి ఉన్న అభిమానానికి నిదర్శనమని అన్నారు.తన నియోజకవర్గ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావిస్తానని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సిద్దిపేట జిల్లా పండుగను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సి ఉండగా, కేసీఆర్‌కు పేరు వస్తుందనే కారణంతోనే ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహించడం లేదని ఆరోపించారు.