
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పోరు రెడీ అయింది. ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల హీట్ ఇప్పుడే రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటరు నమోదు షెడ్యూల్ విడుదల చేయడంతో… ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టాయి.
మొదటగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈసారి ముందుగానే అభ్యర్థులను ప్రకటించి క్షేత్రస్థాయిలో బలమైన ముద్ర వేయాలని భావిస్తోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానం కోసం… పటేల్ రమేశ్ రెడ్డి, డాక్టర్ లోకేష్ యాదవ్, గుత్తా అమిత్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం కోసం మన్నే జీవన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, గౌరీ సతీష్, హర్షవర్ధన్ రెడ్డి, శివసేనారెడ్డి, బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి రేసులో గట్టిగా నిలిచారు. ఆశావహుల జాబితాను పరిశీలించి పీసీసీ త్వరలోనే తుది జాబితాను ఏఐసీసీకి పంపనుంది.
అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం ఈ రెండు గ్రాడ్యుయేట్ స్థానాలపై సర్వశక్తులు ఒడ్డుతోంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి రాకేష్ రెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండగా… అసలు ఉత్కంఠ అంతా మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైడ్రాబాద్ స్థానంపైనే నెలకొంది. ఈసారి బీసీ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు ఉమ్మడి జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తూ అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. నాగేందర్ గౌడ్, కాసాని వీరేశ్ ముదిరాజ్, రవి యాదవ్, అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, దేవీ ప్రసాద్ తదితరులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు బీజేపీ కూడా దక్షిణ తెలంగాణలో తన సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. రాంచందర్ రావు అధ్యక్షతన సమావేశమైన ఆ పార్టీ నేతలు… ఓటర్ల ఎన్ రోల్ మెంట్ తో పాటు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం కోసం పవన్ కుమార్ రెడ్డి, ఎన్వీ సుభాష్, సారంగుల అమర్ నాథ్, ఎస్ మల్లారెడ్డి, గంగాపురం వెంకట రెడ్డి పోటీపడుతుండగా… నల్గొండ-వరంగల్-ఖమ్మం సీటుపై మాత్రం నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
అయినప్పటికీ కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి, పుల్లారావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇటు జనసేన పార్టీ కూడా నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి అభ్యర్థిని ప్రకటించడంతో… ఆ పార్టీ సొంతంగా పోటీ చేస్తుందా లేక మద్దతు ఇస్తుందా అనేదానిపై రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.
మొత్తానికి ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలుకావడంతో… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పీఠం దక్కించుకునేందుకు త్రిముఖ, చతుర్ముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. మరి హస్తం పార్టీ క్యూ కడుతుందా? గులాబీ దళం గురి నిలుస్తుందా? లేదా కాషాయ, జనసేన పార్టీలు సంచలనం సృష్టిస్తాయా? చూడాలి.