ఈమధ్య కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం చాలామంది సాధారణ ఉప్పుకు బదులుగా రాక్ సాల్ట్ (హిమాలయన్ పింక్ సాల్ట్) వాడుతున్నారు. దీంట్లో పోషకాలు ఉంటాయనేది ఎంత నిజమో, పరిమితికి మించి రోజూ వాడితే అంతే ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచిది కదా అని అతిగా వాడితే తీవ్రమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. రాక్ సాల్ట్ వాడకం వల్ల కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం..
పోషకాలు ఉన్నా చాలా తక్కువ: రాక్ సాల్ట్‌లో పొటాషియం, మెగ్నీషియం, కాల్సియం వంటి మినరల్స్ ఉంటాయనే మాట నిజమే. కానీ, వాటి మోతాదు చాలా చాలా తక్కువ. ఇక మనం రోజువారీ తీసుకునే పరిమాణంలో ఈ పోషకాలు శరీరానికి పెద్దగా ఉపయోగపడవు. కాబట్టి పోషకాల కోసం మాత్రమే దీన్ని వాడటం సరైన ఆలోచన కాదు.
గుండెకు ముప్పు తెచ్చే సోడియం: సాధారణ ఉప్పులాగే రాక్ సాల్ట్ కూడా సోడియం క్లోరైడ్‌తోనే తయారవుతుంది. సోడియం ఎక్కువైతే బ్లడ్ ప్రెజర్ (బీపీ) పెరిగి, గుండెపోటు (హార్ట్ ఎటాక్), స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక రోజుకు సోడియం పరిమాణం 2,300 మిల్లీగ్రాములు, గుండె సమస్యలు ఉన్నవారు 1,500 మిల్లీగ్రాములు దాటకుండా చూసుకోవాలి.

కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం: శరీరంలో సోడియం స్థాయిలను నియంత్రించడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. సోడియం ఎక్కువైతే కిడ్నీలపై భారం పడుతుంది. ఇక దీర్ఘకాలంలో ఇది కిడ్నీ స్టోన్స్ (రాళ్లు) ఏర్పడటానికి, ఆ తర్వాత కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడానికి కారణమవుతుంది.
శరీరంలో నీరు చేరడం, హానికర లోహాలు: సోడియం ఎక్కువైతే శరీరంలో నీటి శాతం పెరిగి ఒళ్లు ఉబ్బిపోతుంది. దీనివల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది. అంతేకాకుండా, రాక్ సాల్ట్ సహజసిద్ధంగా తవ్వకాల ద్వారా రావడం వల్ల అందులో లెడ్, ఆర్సెనిక్ వంటి ప్రమాదకర లోహాల మలినాలు ఉండే అవకాశం ఉంది. ఇవి శరీరంలో పేరుకుపోతే తీవ్ర అనారోగ్యానికి దారితీస్తాయి.
రాక్ సాల్ట్ ఆరోగ్యానికి మంచిదే కదా అని అతిగా లేదా రోజూ వాడటం మంచిది కాదు. సాధారణ ఉప్పు అయినా, రాక్ సాల్ట్ అయినా మితిమీరితే ప్రమాదమే. కాబట్టి వంటల్లో ఉప్పును పరిమితంగా మాత్రమే వాడటం అలవాటు చేసుకోండి.
గమనిక: ఇది కేవలం సాధారణ అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. ఇప్పటికే బిపి, గుండె లేదా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు తమ ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.
The post రాక్ సాల్ట్‌నే వాడుతున్నారా? ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.