
మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ ఎకనామికల్ చీఫ్ మహమూద్ అబు అల్వాన్ హతమయ్యాడు.పాలస్తీనాలోని దక్షిణ గాజా స్ట్రిప్‌లో ముఖ్యనగరం అయిన ఖాన్ యూనిస్ పై జరిపిన దాడుల్లో అబు అల్వాన్ హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు.
గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్ (Khan Yunis) ప్రాంతంలో బుధవారం (సెప్టెంబర్ 23) ఇజ్రాయెల్ వైమానిక దళాలు హమాస్ బృందాలు లక్ష్యంగా దాడులు చేశాయి. ఈ దాడిలో హమాస్ సీనియర్ ఆర్థికాధికారి మహమూద్ అబు అల్వాన్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి సంయుక్తంగా ఈ వివరాలను వెల్లడించారు.
గాజాలో హమాస్ ఉగ్రవాదం అంతమయ్యే వరకు తమ సైనిక చర్యలు ఆపబోమని నెతన్యాహు తేల్చిచెప్పారు. హమాస్ కమాండర్లు, కార్యకర్తలను ఏరివేయడంతో పాటు వారికి అందుతున్న నిధుల వనరులను ధ్వంసం చేస్తున్నామని చెప్పారు.హమాస్ తన శక్తిని తిరిగి పునరుద్ధరించుకోవడానికి తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. హమాస్ కోలుకోకుండా దాడులు కొనసాగిస్తామని తెలిపారు.