
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తయిన సందర్భంగా బ్రహ్మోత్సవల నిర్వహణ, వ్యయం, ఆదాయం తదితర వివరాలను వెల్లడించింది టీటీడీ. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఈ సారి మొత్తం 5 లక్షల 76 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అర్చక స్వాములు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా ప్రతినిధులు, భక్తుల సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించామని ఆయన తెలిపారు.
సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించిన ఉత్సవాల సందర్భంగా భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 28 కోట్ల 94 లక్షలు వచ్చినట్లు తెలిపారు. మొత్తం 21 లక్షల 84 వేల అన్న ప్రసాదాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తలనీలాలకు వచ్చిన ఆదాయం 2.04 లక్షలు. భక్తులకు ఇష్టమైన లడ్డూ ప్రసాదం అమ్మకాలు 33 లక్షలకు పైగానే జరిగింది.
మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీ – తిరుపతి నుంచి తిరుమలకు 13,671 ట్రిప్పుల ద్వారా 3,92,106 భక్తులనుచేరవేసినట్లు పేర్కొంది. తిరుమల నుంచి తిరుపతికి 13 వేల 584 ట్రిప్పుల ద్వారా 4,97,195 లక్షల మందికి భక్తులు ప్రయాణం చేసినట్లు టీటీడీ పేర్కొన్నారు.
గరుడసేవలో ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడసేవ రోజున తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ దర్శనం కల్పించామని చైర్మన్ తెలిపారు. గరుడసేవ రోజున భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు తాను, పాలక మండలి సభ్యులు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ ఉన్నతాధికారులు గ్యాలరీలు, క్యూలైన్లలో ప్రత్యక్షంగా పర్యటించి భక్తులతో మాట్లాడినట్లు తెలిపారు.
కొత్త సదుపాయాలు ప్రారంభం
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో పునరుద్ధరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, దుర్లభ్ దర్శన్ వీఆర్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్, భక్తుల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు.
అలాగే మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.90 కోట్లతో తిరుచానూరు ఆలయానికి ఉన్న రోడ్లను అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలిపిరి సమీపంలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 50 ఎకరాల్లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
భవిష్యత్ ప్రణాళికలు
- తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు వృక్ష గోవిందం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
- శ్రీవారి సేవ, శ్రీవారి వైద్యసేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
- టీటీడీ ఉద్యోగుల హౌసింగ్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు రూ.230 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.