
హైదరాబాద్: 9 రోజుల పాటు భక్తులు పూజలు అందుకున్న ఖైరతాబాద్ బడా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు షురూ అయ్యాయి. ఇందులో భాగంగా భారీ టస్కర్ ఖైరతాబాద్ చేరుకుంది. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం సుమారు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుంది. ఇంత భారీ విగ్రహాన్ని సాధారణ ట్రక్కులపైన తీసుకెళ్లేందుకు వీలు కాదు.
అందుకే ప్రత్యేకంగా రూపొందించిన వాహనాన్ని ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఏపీ నుంచి తెప్పించారు. విజయవాడ నుంచి వచ్చిన భారీ టస్కర్‌పై వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు 69 అడుగులు, వెడల్పు 28 అడుగులు కాగా.. విగ్రహాన్ని టస్కర్‌పై సక్రమంగా అమర్చేందుకు వీలుగా దానిపై వెల్డింగ్ పనులు చేయనున్నారు.
వెల్డర్ నాగబాబు ఆధ్వర్యంలో 20 మంది వర్కర్స్‌తో ఈ పనులు జరుగుతున్నాయి. గురువారం (24) అర్ధరాత్రి టైంలో బడా గణపతిని టస్కర్‌పైకి ఎక్కిస్తారని.. ఆ వెంటనే సపోర్టింగ్ వెల్డింగ్ చేస్తారని నిర్వహకులు తెలిపారు. శుక్రవారం (సెప్టెంబర్ 25) ఉదయాన్నే నిమజ్జన ఊరేగింపు మొదలు కానుంది. దాదాపు 2 నుంచి 3 కిలో మీటర్లు శోభాయాత్రకి 6 నుంచి 7 గంటల సమయం పట్టనుంది.
టస్కర్ ప్రత్యేకతలు ఇవే
ఖైరతాబాద్ బడా గణనాథుడిని తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టస్కర్‌ను ఉపయోగిస్తారు. ఈ టస్కర్కి 26 చక్రాలు ఉంటాయి. 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ టస్కర్కు 100 టన్నుల బరువును మోసే సామర్థ్యం ఉంటుంది.
విగ్రహం కదలకుండా ఉండేలా ఐరన్స్తంభాలతో బేస్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ టస్కర్‌ను డ్రైవ్ చేసేందుకు ప్రత్యేకంగా సూర్యాపేట నుండి డ్రైవర్ వచ్చారు.