ఈ రోజుల్లో చాలామంది ఇంట్లోనే డిజిటల్ మిషన్లతో బ్లడ్ ప్రెజర్ (బీపీ) చెక్ చేసుకుంటున్నారు. అయితే, చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల రీడింగ్ తప్పుగా వచ్చి అనవసరంగా భయపడుతుంటారు. మనం కూర్చునే విధానం, తీసుకునే జాగ్రత్తల పైనే బీపీ కచ్చితత్వం ఆధారపడి ఉంటుంది. అందుకే ఇంట్లో బీపీ చెక్ చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలు, కచ్చితమైన ఫలితం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం..
చెకింగ్‌కు ముందు కొద్దిసేపు విశ్రాంతి: బీపీ చెక్ చేసుకోవడానికి కనీసం 5 నిమిషాల ముందు ప్రశాంతంగా కూర్చోవాలి. హడావుడిగా లేదా నడిచి వచ్చిన వెంటనే మిషన్ ఆన్ చేయకూడదు. టీ, కాఫీ తాగినా లేదా సిగరెట్ కాల్వాలన్నా కనీసం 30 నిమిషాల వ్యవధి ఇచ్చాకే బీపీ రీడింగ్ తీసుకోవడం మంచిది.
కూర్చునే పద్ధతి చాలా ముఖ్యం: చెక్ చేసుకునే సమయంలో వెన్నుముకకు సరిగ్గా ఆసరా ఇచ్చి, నిటారుగా కూర్చోవాలి. రెండు పాదాలను నేలపై సమానంగా ఆన్చి ఉంచాలి. ఇక కాళ్లపై కాళ్లు వేసుకుని కూర్చోవడం వల్ల రీడింగ్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

కఫ్ తొడిగే విధానం మరియు చేతి పొజిషన్: బీపీ మిషన్ కఫ్‌ను దుస్తుల పైన కాకుండా నేరుగా చర్మానికి తగిలేలా కట్టాలి. చేయిని గుండె ఎత్తులో ఉండేలా టేబుల్ లేదా సపోర్ట్ పై ఉంచాలి. ఇక రీడింగ్ వచ్చేంత వరకు అస్సలు కదలకుండా, మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండాలి.
సగటు రీడింగ్ తీసుకోవడం శ్రేయస్కరం: కేవలం ఒక్కసారి వచ్చిన రీడింగ్ చూసి టెన్షన్ పడకూడదు. నిమిషం వ్యవధితో రెండుసార్లు చెక్ చేసి, ఆ రెండింటి సగటును లెక్కిస్తే కచ్చితమైన వివరాలు తెలుస్తాయి. ఇక ఒకవేళ మీ బీపీ రీడింగ్ 180/120 దాటితే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఇక ఇంట్లో బీపీ చెక్ చేసుకునేటప్పుడు ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే తప్పుడు రీడింగ్‌ల భయం ఉండదు. సరియైన పద్ధతిలో క్రమం తప్పకుండా బీపీని పర్యవేక్షించుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం.
గమనిక: ఇంట్లో చెక్ చేసుకునే డిజిటల్ పరికరాల రీడింగ్‌లు కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. నిలకడలేని మార్పులు కనిపించినా లేదా శారీరక రుగ్మతలు ఉన్నా సొంత నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్‌ను సంప్రదించి చికిత్స పొందాలి.
The post ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా? కచ్చితమైన రీడింగ్ కోసం ఈ రూల్స్ పాటించండి! appeared first on Manalokam – Latest Telugu News & Updates.