Reading Time: < 1 minute
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన లోతైన వాయుగుండం ఉత్తరాంధ్ర వైపు వేగంగా కదులుతోంది. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ లోతైన వాయుగుండం గత ఆరు గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదిలినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఇది కళింగపట్నానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 140 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ లోతైన వాయుగుండం మరింత పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. ఈరోజు రాత్రి విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య, కళింగపట్నం సమీపంలో ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరోవైపు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఐఎండీ ప్రకారం గంటకు 30 నుంచి 35 నాట్ల వేగంతో గాలులు, అప్పుడప్పుడు 40 నాట్ల వరకు గాలివేగం పెరిగే అవకాశం ఉంది. అంటే సుమారు గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాగులు, కాలువలు, నీటి ప్రవాహాలు ఉధృతంగా మారే ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం కళింగపట్నం, భీమిలి, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ తదితర ఓడరేవుల్లో స్థానిక హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. ఉత్తరాంధ్ర తీరంలో సముద్ర పరిస్థితులు రఫ్‌ నుంచి వెరీ రఫ్‌గా ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.