Reading Time: 2 minutes
Patancheru Cab Driver Rajasekhar Murder Case Three Arrested

Cab Driver Rajasekhar : పటాన్‌చెరువు పరిధిలో కలకలం రేపిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ దారుణ హత్య కేసును శేర్లింగంపల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అంతర్‌రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు శేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. అరెస్టయిన వారిని మహారాష్ట్రలోని థానేకు చెందిన రాహుల్, సూరజ్ శశికాంత్ తవడే, రామ్ చంద్రగా గుర్తించారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న సోలాపూర్, ఢిల్లీలకు చెందిన మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.

పక్కా ప్లాన్‌తోనే కారు రెంట్.. దారిలోనే దారుణం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10వ తేదీన ఈ ఘోరం జరిగింది. బాధితుడు రాజశేఖర్ కారును రోజూ రెంట్‌కు తిప్పుతూ ఐటీ ఉద్యోగులను డ్రాప్ చేస్తుండేవాడు. ఆ రోజు తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఒక ఐటీ ఉద్యోగిని దింపి సికింద్రాబాద్ చేరుకోగా, అక్కడే ఉన్న ఐదుగురు నిందితులు ఓల్డ్ ముంబయి రోడ్డు వైపు తమను దింపాలని రాజశేఖర్‌ను కోరి కారు ఎక్కారు. ప్రయాణిస్తున్న క్రమంలో పటాన్‌చెరువు సమీపంలోకి రాగానే, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ముఠా సభ్యుల్లో ఒకరు మూత్రవిసర్జన నెపంతో కారు దిగాడు. ఆ వెంటనే మిగిలిన నిందితులు రాజశేఖర్ తలకు టవల్ బిగించి, కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే దారుణంగా హత్య చేశారు. అనంతరం కారుతో సహా పారిపోతుండగా కొహెడ్ వద్ద కారు రిపేర్ రావడంతో, వాహనాన్ని అక్కడే పార్క్ చేసి ముఠా సభ్యులు పరారయ్యారు.

గోల్డ్ షాప్ దోపిడీ కోసమే కారు స్కెచ్

ఈ నేరానికి ప్రధాన సూత్రధారిగా ఉన్న రాహుల్, ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తుండగా పరారీలో ఉన్న మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ధనార్జనే ధ్యేయంగా వీరు హైదరాబాద్ వస్తుండేవారు. ఈ క్రమంలో ఒక హోటల్ వద్ద మిగిలిన ముగ్గురితో పరిచయం ఏర్పడి ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో ఢిల్లీకి చెందిన వ్యక్తి ఓ గోల్డ్ షాప్‌లో పెద్ద ఎత్తున చోరీ చేద్దామని ప్రతిపాదించడంతో, ఆ దోపిడీ ఆపరేషన్‌కు కారు అవసరమైంది. ఇందుకోసమే సికింద్రాబాద్‌లో రాజశేఖర్ కారును లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు.

సికింద్రాబాద్ జోన్‌కు కేసు బదిలీ

అరెస్టయిన నిందితుల నుంచి మృతుడు రాజశేఖర్ మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ హత్య కేసు కుట్ర , ప్రారంభానికి సంబంధించిన ఘటనలన్నీ సికింద్రాబాద్ జోన్ పరిధిలోనే జరిగినందున, తదుపరి సమగ్ర విచారణ నిమిత్తం కేసును సికింద్రాబాద్ జోన్‌కు బదిలీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.