వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో బలం తగ్గిపోవడం సహజం. అందుకే ఎముకలను గట్టిపరచడానికి చాలామంది పెద్దలు క్యాల్షియం, విటమిన్-డి మాత్రలు వాడుతుంటారు. అయితే వృద్ధులు కిందపడినప్పుడు ఎముకలు విరగకుండా కాపాడటంలో ఈ మాత్రలు అనుకున్నంత గొప్పగా పనిచేయడం లేదని తాజా ఆరోగ్య సమీక్ష తేల్చి చెప్పింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం..
లక్షల మందిపై భారీ సర్వే: ఎముకల ఆరోగ్యంపై నిర్వహించిన ఈ విస్తృత అధ్యయనంలో దాదాపు 1.53 లక్షల మంది వృద్ధుల డేటాను పరిశీలించారు. ఇక ఇందులో కొందరు క్యాల్షియం, విటమిన్-డి రెండూ వేసుకుంటే, మరికొందరు ఏదో ఒక మాత్ర మాత్రమే క్రమం తప్పకుండా వేసుకున్నారు. కానీ వీరు కిందపడినప్పుడు ఎముకలు లేదా తుంటి (హిప్) ఎముకలు విరగడాన్ని ఈ మాత్రలు ఎంతమాత్రం నిరోధించలేకపోయాయని పరిశోధనలో తేలింది.

మాత్రల కంటే వ్యాయామమే మిన్న: సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంపై నియంత్రణ తగ్గి, బ్యాలెన్స్ తప్పి కిందపడుతుంటారు. అందుకే కేవలం క్యాల్షియం, విటమిన్-డి మాత్రలపైనే ఆధారపడకుండా.. శరీర సమతుల్యతను పెంచే చిన్నపాటి వ్యాయామాలు, ఎముకలను బలంగా ఉంచే వ్యాయామాలు చేయడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇక వీటితో పాటు సరైన సమతులాహారం తీసుకోవడం వల్ల పడిపోయినా గాయాల తీవ్రత తగ్గుతుంది.
ఇక ఎముకలు గట్టిపడటానికి మాత్రలే శరణ్యం అనుకోకుండా, రోజువారీ జీవితంలో తేలికపాటి బ్యాలెన్సింగ్ వ్యాయామాలు, సరైన పోషకాహారాన్ని భాగం చేసుకోవడం వృద్ధులకు ఎంతో శ్రేయస్కరం.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహనా కోసం మాత్రమే, డాక్టర్ ఇచ్చిన సలహాలను పాటిస్తూ, వారి మార్గదర్శకత్వంలోనే మందులు వాడాలి.
The post వృద్ధులకు క్యాల్షియం, విటమిన్-డి మాత్రలు సరిపోవా? తాజా సమీక్షలో కీలక విషయాలు! appeared first on Manalokam – Latest Telugu News & Updates.