Reading Time: 2 minutes

ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు..? అసలు విషయం బయటపెట్టిన ఈసీ

Caption of Image.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంలో తీవ్ర అంతర్గత విభేదాలు ఉన్నట్లు జాతీయ పత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‏లో వచ్చిన కథనం దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. గడిచిన 10 నెలల్లో తమకు తెలియకుండానే జారీ చేసిన పలు ఉత్తర్వులు, నిబంధనల మార్పులపై ఎన్నికల కమిషనర్లు సుఖీబీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు అధికారికంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సదరు కథనం పేర్కొంది. ఈ కథనం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపడంతో కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై వివరణ ఇచ్చింది. 

ఏకగ్రీవంగానే అన్ని నిర్ణయాలు: ఈసీ

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విషయంలో ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వచ్చిన మీడియా నివేదికను ఈసీ ఖండించింది. ఎస్ఐఆర్‌తో సహా భారత ఎన్నికల సంఘం తీసుకున్న అన్ని నిర్ణయాలు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆమోదంతో ఏకగ్రీవంగా జరిగాయని స్పష్టం చేసింది. 

ఏదైనా ఒక అంశంపై ఎన్నికల కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ మధ్య వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవచ్చు. అంతిమంగా నిర్ణయాలు మాత్రం ముగ్గురు ఆమోదంతోనే జరుగుతాయని వివరణ ఇచ్చింది. ఎన్నికల కమిషనర్లు ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు ఫారమ్-6 మార్పులు, ఓటర్ల డేటాబేస్ కేంద్రీకరణ వంటి కొన్ని కీలక ప్రతిపాదనలపై కేవలం తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారని.. అవి సాధారణ అంతర్గత చర్చల్లో భాగమేనని ఈసీ పేర్కొంది.

సీఈసీ రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్

సర్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంలో తీవ్ర అంతర్గత విభేదాలు ఉన్నాయని.. ఇద్దరు కమిషనర్లు దీనిని వ్యతిరేకించారని జాతీయ పత్రికలో వచ్చిన కథనాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్, బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‎ను బీజేపీ తమ జేబు సంస్థగా మార్చుకుందని.. ఈసీ తీరు ప్రతిపక్షాలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆరోపించాయి. బీజేపీకి తొత్తులా వ్యవహరిస్తోన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రధాని మోడీ ఆదేశాల మేరకే జ్ఞానేష్ కుమార్ పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. 

‘‘జ్ఞానేష్ తన బాస్ మోడీ లాగే నియంతలా ఈసీని పాలిస్తున్నాడు. మోడీని సంతోషపెట్టడానికి ఓట్ల దొంగతనంలో నిమగ్నమయ్యాడు. మోడీ ఎన్నికల సంఘాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ద్వారా రుజువైంది. ఈ విషయం మేం గతంలోనే చెప్పాం. జ్ఞానేష్ కుమార్ మోడీ కీలుబొమ్మ. మోడీ, జ్ఞానేష్ కలిసి దేశ ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం కలిగించారు. వీళ్లిద్దరూ ఒకటి గుర్తుంచుకోవాలి.. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి జవాబు చెప్పాల్సి ఉంటుంది. నేరానికి శిక్ష తప్పకుండా పడుతుంది’’ అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. 

©️ VIL Media Pvt Ltd.