Reading Time: < 1 minute
Dating App Scam Hyderabad Lawyer Loses Over Rs 5 Crore In Blackmail Case

Dating App Scam: హైదరాబాద్‌లో ఉన్న ఇజ్జత్‌నగర్‌కు చెందిన న్యాయవాదికి 2025 ఆగస్టులో ఒక ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా ‘దిశ’ అనే పేరుతో ఒక వ్యక్తి పరిచయమయ్యారు. తాను ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినని అవతలి వ్యక్తి చెప్పుకొచ్చారు. క్రమంగా వారి మధ్య నమ్మకం పెరగడంతో.. సైబర్ క్రైమ్ బాధితుడు వ్యక్తిగత విషయాలు, వివరాలను ఆమెతో పంచుకున్నారు. మొదటగా తన తండ్రి మరణించారని.. వారి అంత్యక్రియల ఖర్చుల కోసమంటూ ఆ వ్యక్తి బాధితుడి నుంచి 4.3 లక్షలు తీసుకున్నారు.

ఆ తర్వాత ఆ డబ్బును అడగగా తిరిగి ఇవ్వకపోవడంతో, బాధితుడు మరింత డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో సదరు వ్యక్తి అసలు రూపం బయటపెట్టాడు. తాను ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తినని, తన అసలు పేరు ‘అలీనా’ అని చెప్పింది. అంతటితో ఆగకుండా, తమ మధ్య జరిగిన వ్యక్తిగత చాటింగ్‌లను బయటపెట్టి పరువు తీస్తానని, బాధితుడి ఇంటికి మనుషులను పంపుతానని బెదిరింపులకు దిగింది.

దీంతో భయపడిపోయిన బాధితుడు వారి నంబర్‌ను బ్లాక్ చేశారు. కొంతకాలం తర్వాత.. జూలై 2026లో సదరు నిందితులు మళ్లీ బాధితుడిని సంప్రదించి.. తన తల్లి ఆసుపత్రిలో ఉందని చెప్పుకొచ్చింది. వ్యక్తిగత చాటింగ్‌లను కుటుంబ సభ్యులకు పంపుతానని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని నిరంతరం బ్లాక్‌మెయిల్ చేస్తూ.. జూలై నుంచి సెప్టెంబర్ 15 మధ్య కోట్ల రూపాయలను వసూలు చేశారు.

సెప్టెంబర్ నెలలో గచ్చిబౌలి వద్ద నిందితులు పంపిన వ్యక్తులకు బాధితుడు ఏకంగా 77 లక్షల నగదును నేరుగా అందించారు. ఇలా తన వ్యక్తిగత పొదుపు, కుటుంబ పొదుపు మొత్తాలతో పాటు, ఒక ఫ్లాట్‌ను అమ్మగా వచ్చిన డబ్బును కూడా కలిపి మొత్తం రూ.5 కోట్లకు పైగా ఆ మోసగాళ్లకు ముట్టజెప్పారు. ఈ వేధింపులు మితిమీరిపోవడంతో బాధితుడు సెప్టెంబర్ 19న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.