Reading Time: < 1 minute
Telangana Assembly Ethics Committee Meeting Ends On Padi Kaushik Reddy Issue

Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ సమావేశం ముగిసింది. సభలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి కమిటీ విచారణ చేపట్టింది. తాజాగా కౌశిక్ రెడ్డి సమర్పించిన వివరణ, ఆయన కోరిన అదనపు గడువు, సభా కార్యకలాపాలకు సంబంధించిన ఫుటేజీ అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.

సమావేశంలో ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి కమిటీకి రాసిన లేఖకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. వివరణ ఇవ్వడానికి తనకు ఆరు వారాల గడువు కావాలని కౌశిక్ రెడ్డి గతంలో కమిటీని కోరారు. ఆ రోజు అసెంబ్లీలో జరిగిన పూర్తి కార్యకలాపాల వీడియో ఫుటేజీని కూడా అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కౌశిక్ రెడ్డి కోరిన ఆరు వారాల గడువును మరింత పొడిగించాలా? లేదా? అనే అంశంపైనా కమిటీ చర్చించారు. అయితే ఈ అంశంపై బీఆర్‌ఎస్‌కు చెందిన కమిటీ సభ్యులు గడువు ఇవ్వాలని కోరారు. కాకపోతే ఈ అంశంపై తుది నిర్ణయం ఏమిటనేది స్పష్టంగా వెల్లడి కావాల్సి ఉంది.

అసెంబ్లీ ఘటనకు సంబంధించిన మరికొంత సీసీటీవీ ఫుటేజీని ఇవ్వాలని బీఆర్‌ఎస్ సభ్యులు కోరగా.. అదనపు ఫుటేజీ ఇవ్వడంపై కొంత అభ్యంతరం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఘటనకు సంబంధించిన ఫుటేజీని కమిటీ పరిశీలనకు ఉంచినట్లు సభ్యులు సూచించారు. చివరకు 30వ తేదీకి కమిటి విచారణను వాయిదా వేసింది.