
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ..పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. దీంతో పాకిస్తాన్ వ్యాప్తంగా టెన్షన్ వాతావణం నెలకొంది. ఇస్లామాబాద్ వ్యాప్తంగా భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజధానిలోకి రాకుండా అడ్డుకునేందుకు రోడ్లపై కంటైనర్లను మోహరించి ఒక గోడలా మారుస్తున్నారు. వేలాది మంది పోలీసుల్ని రంగంలోకి దింపారు. ఇస్లామాబాద్ ఆస్పత్రులను హైఅలర్ట్‌లో ఉంచారు.
ఇస్లామాబాద్, రావల్పిండి ప్రాంతాల్లో 22 వేలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. పంజాబ్ ప్రావిన్సు నుంచి సుమారు 19 వేల మందిని, సింధ్ నుంచి 1950 మంది పోలీసుల్ని ఇస్లామాబాద్‌కు తరలించారు. పంజాబ్ ప్రభుత్వం రావల్పింది, అట్టోక్, జెల్హమ్, మియాన్వాలీ జిల్లా్ల్లో పాక్ రేంజర్స్‌ను మోహరించేందుకు సిద్ధమవుతోంది.
ఇస్లామాబాద్‌కు దారి తీసే అన్ని మార్గాల్లో కంటైనర్లను మోహరించాడు. భారీగా వచ్చే ప్రజల్ని అడ్డుకునేందుకు వాటిని ఒక గోడలా మార్చారు. కంటైనర్లను కలిపి ఉంచేందుకు వెల్డింగ్ చేస్తున్నారు. ఇక ఇస్లామాబాద్ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీని విధించారు. ఆస్పత్రుల్లో రక్తపు నిల్వలు 100 బ్యాగులు ఉండేలా చూడాలని, అంబులెన్స్ డ్రైవర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర బెడ్స్, మందులు, ఆక్సిజన్, వైద్య సామాగ్రి సిద్ధంగా ఉండాలని సూచించారు. సెప్టెంబర్ 30 వరకు ఆస్పత్రుల్ని హై అలర్ట్‌లో ఉంటారు.
పీటీఐ మాత్రమే కాకుండా, సెప్టెంబర్ 27న జమాతే ఇస్లామీ ధరల పెరుగుదల, రైతుల సంఘం కిసాన్ ఇత్తేహాద్ కూడా రైతుల సమస్యలపై పాక్ రాజధాని ఇస్లామాబాద్ మార్చ్‌కు పిలుపునిచ్చాయి. మరోవైపు, ఈ మార్చ్‌పై ఇస్లామాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు ప్రజా రహదారులు, హైవేలపై మోహరించే చట్టబద్ధ హక్కు లేదని పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ మార్చ్ నేపథ్యంలో ఆయన సోదరీమణులు అలీమా ఖాన్, ఉజ్మా ఖానుమ్, నోరీన్ నియాజీని 30 రోజులపాటు నిర్బంధించినట్లు తెలుస్తోంది. ఇది పాకిస్తాన్‌లో మరింత ఆందోళన పెంచింది.