
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టడీ మృతి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత తీవ్రంగా స్పందించింది. సాయికృష్ణ కస్టడీ మృతి కేసులో డీజీపీ విజయవాడ పోలీస్ కమిషనర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం విచారించింది. హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టులో విచారణ ముగిసే వరకు హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణలపై పూర్తిస్థాయిలో స్టే విధించారు. పోలీసు కస్టడీలో సాయికృష్ణ అదృశ్యం కావడం, మృతి చెందడం పూర్తిగా చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలు, దర్యాప్తు సమాచారాన్ని సీల్డ్ కవర్ రూపంలో సెప్టెంబర్ 30వ తేదీ నాటికి అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, తదుపరి విచారణను అక్టోబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.
గురుమూర్తి ప్రైవేట్ పిటిషన్..!
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ డిజిపి, విజయవాడ సిపి రాజశేఖర్ బాబు,సౌత్ ఏసిపి మానసను నిందితులుగా చేర్చాలంటూ తిరుపతి ఎంపీ గురుమూర్తి విజయవాడ రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో వైసిపి ఎంపీ గురుమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో దాఖలైన ప్రైవేట్ పిటిషన్ పై 2nd AJMFC విచారణ జరిపిన కోర్టు గురుమూర్తి దాఖలు చేసిన ప్రైవేట్ పిటిషన్ ను అనుమతించి తిరుపతి ఎంపీ గురుమూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది.జులై 21వ తేదీన కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేయగా సుదీర్ఘ విచారణ గురుమూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అనుమతి ఇచ్చింది.
ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ గురుమూర్తి 2 nd ADJ కోర్టులో దాఖలు చేసిన ప్రైవేట్ పిటిషన్ పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా.. కోర్టు ఆదేశాలు రద్దు చేయాలని విజయవాడ సౌత్ ఏసీపీ మానస హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా తనపై చర్యలు తీసుకోవాలని దాఖలు చేసిన పిటిషన్ చెల్లుబాటు కాదని ప్రైవేట్ పిటిషన్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే కింది కోర్టు గురుమూర్తి ఇచ్చిన ఆదేశాలపై ఏపీ హైకోర్టు స్టే విధించగా వెనువెంటనే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీపీ రాజశేఖర్ బాబు సైతం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇద్దరి పిటిషన్లు విచారించిన ఏపీ హై కోర్టు ఏసీపీ మానసకు ఇచ్చిన ఆదేశాలు ఇద్దరికీ వర్తిస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో హై కోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎంపీ గురుమూర్తి.
కేసు వివరాలు
మార్కాపురానికి చెందిన సాయికృష్ణపై రెండు నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలోని కృష్ణలంక పోలీసులు 2026 మే 5న అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుస్టేషన్‌కు వెళ్లిన తన కుమారుడ వదిలేయమని కోరినా పోలీసులు కనికరం చూపలేదని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపించారు. అయితే ఆ తర్వాత సాయికృష్ణ ఆచూకీ లభించకపోవడంతో, అతడు పోలీసుస్టేషన్ నుంచి మాయమయ్యాడంటూ ఆమె జూన్ 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ తన రిమాండ్ రిపోర్టు, చార్జ్‌షీట్‌లో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది.
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో అప్పట్లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఎస్.ఎస్.వి.వి. నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు అశోక్ కుమార్, నాని కలిసి సాయికృష్ణపై తీవ్రంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి, దారుణంగా కొట్టారని పేర్కొంది. పోలీసు స్టేషన్‌లో తీవ్ర గాయాలపాలై సాయికృష్ణ పరిస్థితి విషమించడంతో, స్టేషన్‌లో ఉంచితే అనుమానం వస్తుందని సీఐ నాగరాజు ఆదేశాల మేరకు అతడిని ఓ పాడుబడ్డ ప్రైవేట్ భవనానికి తరలించారు. సీఐ సన్నిహితుడైన సురేష్ మే 12న ఆ భవనానికి వెళ్లినప్పుడు పోలీసులు చంపాలనే ఉద్దేశంతోనే తనను కొడుతున్నారని సాయికృష్ణ సురేష్‌తో చెబుతూనే స్పృహ కోల్పోయి మరణించాడు.
మే 12-13 అర్ధరాత్రి నిందితులు సాయికృష్ణ మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, మోటార్ సైకిల్‌పై విజయవాడలోని స్వర్గపురి శ్మశానవాటికకు తరలించి పూర్తిగా దహనం చేశారు. ఆధారాలు లేకుండా చేసేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లు, ఫోటోలను కూడా తొలగించే ప్రయత్నం చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా సీఐ నాగరాజును (A1) పేర్కొంటూ, మరో ఆరుగురితో కలిపి మొత్తం 7 మందిపై సిట్ అధికారులు విజయవాడ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తు కోరుతూ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. ఈ లోపే ఈ కేసు సుప్రీంకోర్టుకి చేరింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..