
టోక్యో: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను చరిత్ర సృష్టించారు. జపాన్ వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఆమె రజత పతకం సాధించారు. మహిళల 49 కేజీల విభాగంలో పోటీపడ్డ ఆమె స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలతో కలిపి మొత్తం 198 కేజీల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచారు.
తద్వారా ఆసియా క్రీడల్లో పతకం సాధించాలనే తన చిరకాల వాంఛను నేరవేర్చుకున్నారు. మీరాబాయి చానుకు కూడా ఆసియా క్రీడల్లో ఇదే తొలి మెడల్. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటికే పతకాలు సాధించిన మీరాబాయి చానుకు ఇప్పటివరకు ఆసియా క్రీడల పతకం ఒక్కటే లోటుగా ఉండేది.
తాజా రజతంతో ఆమె తన పతకాల కలెక్షన్‌ను సంపూర్ణం చేసుకున్నారు. దీంతో పాటు వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో 28 ఏళ్ల భారత పతక నిరీక్షణకు మీరాబాయి చాను తెరదించారు. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో భారత దిగ్గజ వెయిట్‌లిఫ్టర్ కర్ణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించారు. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఇండియాకు పతకం రాలేదు. తాజా విజయంతో 28 ఏళ్ల భారత పతక నిరీక్షణకు చాను తెరదించారు.