
- రాష్ట్రానికి 9.56 లక్షల ఇండ్లు ఇవ్వండి
- కేంద్రానికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
- కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో భేటీ
- తొలి విడత 2 లక్షల ఇండ్లిచ్చినందుకు కృతజ్ఞతలు
- ఎల్‌నినో పరిస్థితులు, విద్యుత్ డిమాండ్‌పై చర్చ
- పంట మార్పిడి, అంతర్జాతీయ మార్కెట్‌కు
- కేంద్ర సాయం కోరిన ముఖ్యమంత్రి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అవసరాలు, డిమాండ్‌కు తగ్గట్టుగా 9.56 లక్షల ఇండ్లను తక్షణమే మంజూరు చేయాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలోని నిరుపేదల గృహ నిర్మాణ కలను సాకారం చేసేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ( పీఎంఏవై-జీ) కింద ఇండ్లను కేటాయించాలన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గత జులైలో తాను ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా రాష్ట్రంలోని అర్హులైన 11,56,915 కుటుంబాలకు పక్కా ఇండ్లు మంజూరు చేయాలని సమర్పించిన సమగ్ర వినతిపత్రాన్ని ప్రస్తావించారు. పీఎంఏవై-జీ పథకంలో భాగంగా మొదటి విడత కింద తెలంగాణకు 2 లక్షల ఇండ్లను కేటాయించినందుకు కేంద్ర మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేద గ్రామీణ కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, హౌసింగ్ సెక్రటరీ గౌతమ్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అన్నదాతలకు అండగా నిలవండి..
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడుతున్న ఎల్‌నినో ప్రతికూల ప్రభావాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి అవసరాల కోసం రైతాంగం మోటార్లపై ఆధారపడటంతో వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం, డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగిందని వివరించారు. ఎల్‌నినో ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఎక్కడా రైతులకు సాగు విద్యుత్‌లోగానీ, ప్రజలకు తాగునీటి సరఫరాలోగానీ ఎలాంటి అంతరాయం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి.. క్షేత్రస్థాయిలో అమలు చేస్తోందని స్పష్టం చేశారు. అయితే, విపత్కర వాతావరణ పరిస్థితుల వల్ల అన్నదాతలు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోకుండా అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని, ఈ గడ్డు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని తక్షణమే అందించాలని చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు.
వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తున్నం..
వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న విప్లవాత్మక విధానాలను కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు తగ్గట్టుగా సన్న రకం వరిని సాగు చేసే రైతులకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తూ ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ఎల్‌నినో లాంటి విపత్తుల నేపథ్యంలో కేవలం వరిపైనే ఆధారపడకుండా.. అధిక లాభాలు తెచ్చిపెట్టే ప్రత్యామ్నాయ వాణిజ్య పంటల సాగు వైపు రైతులను విస్తృతంగా మళ్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని వివరించారు. అన్నదాతలు పండించిన ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో అత్యాధునిక హంగులతో 250 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఫ్రూట్స్, వెజిటెబుల్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైతులను పంట మార్పిడి దిశగా సమాయత్తం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంటూ, ఇందుకు అవసరమైన సహాయ సహకారాలను కేంద్రం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.