
కోల్‌కతా: 2007 నాటి భూసేకరణ వ్యతిరేక నిరసనల కేసులో నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ అరెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో కాక రేపుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష టీఎంసీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ క్రమంలో మిలన్ ప్రధాన్ అరెస్టుపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ బీజేపీపై ఫైర్ అయ్యారు. మిలన్ ప్రధాన్ అరెస్టును రాజకీయ కక్ష సాధింపు, ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించారు.
బీజేపీపై పోరాటం ఆగదు: రాహుల్
నందిగ్రామ్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ బరిలో దించిన అభ్యర్థి మిలన్ ప్రధాన్ అరెస్ట్ ఘటనతో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ఎన్నికల వ్యవస్థపై బీజేపీకి నమ్మకం లేదని ఈ ఘటన చూపిస్తోందని అన్నారు. ఎన్ని అరెస్టులు చేసిన కాంగ్రెస్ పార్టీ తలొగ్గదని.. బీజేపీపై పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు.
స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలపై బీజేపీకి నమ్మకం లేదని.. అందుకే ఆ పార్టీ ఓట్ చోరీ, ప్రభుత్వాలను కూలగొట్టడం, ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం ద్వారా అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండాలని చూస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలల్లో పోటీ చేయలేనుకోవడం లేదని.. అసలు పోటీనే లేకుండా చేయాలని ఆ పార్టీ కోరుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హరిస్తోంది: మమతా
నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ అరెస్టును టీఎంసీ అధినేత్రి, బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. బీజేపీ, ఈసీ కుమ్మక్కై రోజురోజుకు దేశంలో ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నాయని ఆరోపించారు. ‘‘నందిగ్రామ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి టీఎంసీ మద్దతు ప్రకటించిన కొద్ది నిమిషాలకే కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను అరెస్టు చేశారు. ఈ సమయం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది బీజేపీ యథావిధి ఫార్ములా. పాత కేసును తవ్వి తీయడం. బీజేపీ ప్రతీకార రాజకీయాలు, అఘాయిత్యాలు ఒక స్పష్టమైన పద్ధతిని చూపిస్తున్నాయి’’ అని దీదీ విమర్శించారు.
►ALSO READ | బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ అరెస్ట్
కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ అరెస్ట్:
ఉప ఎన్నికల వేళ బెంగాల్ పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ అరెస్ట్ అయ్యారు. 2007 నాటి నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ అభ్యర్థిని పశ్చిమ బెంగాల్ పోలీసులు శుక్రవారం (సెప్టెంబర్ 18) అదుపులోకి తీసుకున్నారు. నందిగ్రామ్ ఉప ఎన్నిక రేసు నుంచి టీఎంసీ తప్పుకుని కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించిన గంటల వ్యవధిలోనే మిలన్ ప్రధాన్ అరెస్ట్ కావడం గమనార్హం. మిలన్ ప్రధాన్ అరెస్ట్ బెంగాల్ రాజకీయాలను మరింత హీటెక్కించింది.